Share News

HCU: అట్టుడికిన హెచ్‌సీయూ

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:53 AM

హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వ భూముల వేలం చేయకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులతో జరిగిన వాగ్వాదం, తోపులాటల తర్వాత, లాఠీచార్జీతో విద్యార్థులకు గాయాలయ్యాయి

HCU: అట్టుడికిన హెచ్‌సీయూ

చెట్ల తొలగింపునకు వచ్చిన అధికారులను అడ్డుకున్న విద్యార్థులు

  • భూముల వేలాన్ని అడ్డుకుంటామని బైఠాయింపు

  • పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం.. పోలీసుల లాఠీచార్జి

రాయదుర్గం/హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ నాడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) రణరంగంగా మారింది. ప్రశాంతంగా ఉన్న వర్సిటీని ఆగం చేయొద్దని, బంగారంలాంటి భూములను వేలం వేయొద్దని ఓవైపు విద్యార్థులు.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదని పోలీసులు, అధికారులు మరోవైపు వాదించడంతో వర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు, విద్యార్థుల మధ్య పరస్పర వాగ్వాదాలు, తోపులాటలతో అట్టుడికింది. క్యాంప్‌సలోని 400 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిందని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న భూమిలోని చెట్లను ఎక్స్‌కవేటర్లతో తొలగించేందుకు ఆదివారం అధికారులు వచ్చారు. అయితే విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.


భూములను వేలం వేస్తే సహించేది లేదని, వేలాన్ని అడ్డుకుంటామని విద్యార్థులు అక్కడే బైఠాయించారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, సుమారు వందమంది విద్యార్థులను మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని, మిగతా వారిని ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూముల వద్దకు ఎవరు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి 10గంటల సమయంలో 28 మంది విద్యార్థులను విడుదల చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దృష్టికి సమస్య..

హెచ్‌సీయూలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఏబీవీపీకి చెందిన కొందరు విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. ఈ ఘటనపై బండి సంజయ్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ద్వారా భయపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన చేయాలని చూస్తోందని, వర్సిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా? అని మండిపడ్డారు. భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. హెచ్‌సీయూలో పోలీసులు హింసాత్మకంగా ప్రవర్తించారని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. 2016లో రోహిత్‌ వేముల మరణ సమయంలో విద్యార్థుల బాధను చెబుతూ వర్సిటీలోకి వచ్చిన రాహుల్‌ గాంధీ.. ఇప్పుడు అదే క్యాంప్‌సపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.


పోరాటం చేస్తాం: హెచ్‌సీయూ విద్యార్థులు

భూముల వేలం పాటను అడ్డుకుంటామని పలు విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. జీవవైవిధ్యం దెబ్బతినేలా వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం సరికాదని హెచ్‌సీయూ స్టూడెంట్స్‌యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీ త్రివేణి అన్నారు. ఇక్కడి భూముల్లో అనేకరకాల జంతువులు, చెట్లు ఉన్నాయని వాటిని కాపాడేందుకు పోరాటం చేస్తామని వర్సిటీ విద్యార్థిని అనన్య హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పోలీసులతో దాడులు చేయించినంత మాత్రాన భయపడేది లేదని స్టూడెంట్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ నిహాద్‌ పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును ఎస్‌ఎ్‌ఫఐ తెలంగాణ విభాగం ఖండించింది.

ఇవి కూడా చదవండి:

మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..

Updated Date - Mar 31 , 2025 | 05:53 AM