హమ్మయ్యా...!
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:03 AM
మార్చి 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిసాయి. మొదటిసారి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎంతో ఆందోళనలకు గురయ్యారు.

ముగిసిన పదో తరగతి పరీక్షలు
430 మంది విద్యార్థులు గైర్హాజర్
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు : కలెక్టర్ రంజిత్ బాషా
రేపటి నుంచి పది పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
కర్నూలు ఎడ్యుకేషన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : మార్చి 17వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిసాయి. మొదటిసారి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎంతో ఆందోళనలకు గురయ్యారు. దీనికి తోడు ఈసారి ఏడు పేపర్లును మాత్రమే నిర్వహించారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్షల టెన్షన్‌కు తోడు వేసవి ఎండల తీవ్రత తోడైంది. ఒకటి రెండు సంఘటనలు మినహా ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి పదో తరగతి పరీక్షకు గైర్హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు విద్యాశాఖ అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తుంది. సోషల్ స్టడీస్ పరీక్షకు మొత్తం విద్యార్థులు 32,420 మంది నమోదు చేసుకున్నారు. 31,990 పరీక్షకు హాజరు కాగా, 430 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు. కర్నూలు జిల్లాలో 517 ఉన్నత పాఠశాలల నుంచి రెగ్యులర్, ప్రైవేటు ఓపెన్ స్కూల్ విద్యార్థులు మొత్తం 40,776 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 31,410 మంది కాగా, ప్రైవేటుగా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 7038 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల కోసం 172 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా 2328 మంది నమోదు చేసుకున్నారు. పది పరీక్షల నిర్వహణకు దాదాపు 2,300 మందికి విధులను కేటాయించారు. జిల్లా పరీక్షల పర్యవేక్షణాధికారిగా అమరావతి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ అబ్రహాం, కడప ఆర్జేడీ శామేల్, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆధ్వర్యంలో పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. చివరి రోజు మంగళవారం పరీక్ష రాశాక విద్యార్థులు పరీక్ష కేంద్రాల నుంచి కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. కొత్త విద్యాసంవత్సరంలో కళాశాలలో కలుసుకుందామంటూ వీడ్కోలు చెప్పుకున్నారు. పరీక్షలు పూర్తి కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తమ సరంజామాను సర్దుకుని సొంత గ్రామాలకు బయలుదేరేందుకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రాజ్‌విహార్, సీ.క్యాంపు, బిర్లాగేటు బస్టాపుల్లో రద్దీగా కనిపించింది.
రేపటి నుంచి పది పరీక్షల స్పాట్ వాల్యుయేషన్: ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బి. తాండ్రపాడులోని క్రేడో ఇంగ్లీషు మీడియం పాఠశాలలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల మూల్యాంకన శిబిరం ప్రారంభం కానున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు.
ప్రశాంత వాతావారణంలో పది పరీక్షలు
జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం స్థానిక కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
- కలెక్టర్ రంజిత్ బాషా