దొంగలు బాబోయ్..!
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:26 AM
పట్టణ శివారులోని ఇళ్లను దొంగలు లక్ష్యం గా చేసుకున్నారు. వరుస చోరీల ఘటనలతో ప్రజలు భయభ్రాంతుల కు గురవుతున్నారు. ఇంటికితాళం వేసి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వరుస చోరీల ఘటనలే అందుకు నిదర్శనంగా మారుతున్నాయి.

నంద్యాలలో ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీ
మరో రెండు ఇళ్లలో విఫలయత్నం
నంద్యాల క్రైం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని ఇళ్లను దొంగలు లక్ష్యం గా చేసుకున్నారు. వరుస చోరీల ఘటనలతో ప్రజలు భయభ్రాంతుల కు గురవుతున్నారు. ఇంటికితాళం వేసి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వరుస చోరీల ఘటనలే అందుకు నిదర్శనంగా మారుతున్నాయి. ఇటీవలే నంద్యాల పట్టణ శివారులోని క్రాంతినగర్‌లో టైలర్స్ అసోసియేషన్ నాయకుడు సుభాన్ ఇంట్లో భారీ చోరీ ఘటన మరువకముందే మంగళవారం తెల్లవారుజామున పట్టణ శివారులోని క్రాంతినగర్‌లో నేషనల్ హైవేకు పక్కనే ఉన్న నందిగ్రీన్ హోమ్స్ విల్లాలో వరుసగా నాలుగు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి రూ.3 లక్షల నగదు, 12 తులాల బంగారు, అర కిలో వెండిని అపహరించుకుపోయారు. బెడ్‌రూమ్‌లో నిద్రిస్తుండగా వారు బయటకు రాకుండా తలుపులకు గొళ్లెం పెట్టి చోరీలకు పాల్పడ్డారు. మరో రెండు ఇళ్లల్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఇంట్లోవారు గుర్తించి కేకలు వేయడంతో దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. పట్టణ శివారు ప్రాంతంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ లేకపోవడం, సీసీకెమెరాల వ్యవస్థ పనిచేయకపో వడంతో దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వరుస చోరీల ఘటనలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇదిలా ఉండగా చోరీలు జరిగిన ప్రాంతానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మిగనూరులో పట్టపగలు చోరీ
టఎమ్మిగనూరు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో మంగళవారం దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన సమాచా రం మేరకు.. సాయినగర్‌లో నివాసం ఉంటున్న అర్జున్ పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ ప్రాంతంలో ఇంజనీరింగ్ హార్డ్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం భార్య కర్నూలులో తమ బంధువుల ఇంట్లో జరిగిన దేవరకు వెళ్లడంతో అర్జున్ ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లాడు. దీన్ని అదునుగా తీసుకున్న దొంగలు ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న మూడున్నర తులాలు బంగారు నగలు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం వచ్చిన అర్జున్ ఇంటి తాళాలు పగిలి పోయి ఉండటాన్ని గమనించి స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టపగలు దొంగతనానికి పాల్పడిన దొంగలు ఇంట్లో ఏడు తులాలు బంగారు, రూ. రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు స్థాని కులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో న్యూ ఇందిరా నగర్‌లో సైతం టనాలుగైదు రోజుల క్రితం దొంగలు చోరీకి విఫలయత్నం చేసినట్లు స్థానికులు చర్చించుకున్నారు.