Share News

అభివృద్ధి పథంలో ముందుండాలి

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:22 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్ఫూర్తితో జిల్లా అధికార యంత్రాంగం కష్టపడి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

 అభివృద్ధి పథంలో ముందుండాలి
ఉగాది ఉత్సవాలకు హాజరైన మంత్రులు ఫరూక్‌, బీసీ, కలెక్టర్‌, జేసీ

మంత్రులు ఫరూక్‌, బీసీ

కలెక్టరేట్‌లో ఘనంగా విశ్వావసు నామ ఉగాది వేడుకలు

నంద్యాల నూనెపల్లె, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్ఫూర్తితో జిల్లా అధికార యంత్రాంగం కష్టపడి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో విశ్వావసు నామ ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డిలతోపాటు కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనం చేశారు. ప్రవీణ్‌కుమార్‌ శర్మ, శివకుమార్‌ శర్మ ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంత్రులు ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఉగాది పండుగ కావడంతో తెలుగువారి సంప్రదాయం ప్రకారం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్‌, ఆర్డీవో విశ్వనాథ్‌, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అలరించిన కవి సమ్మేళనం: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. గెలివి సహదేవుడు, గ్రంథే నరేంద్ర, గంగుల నాగరాజు, దోనిపూడి నరేష్‌, నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్‌, నీలకంఠమాచారి, మహబూబ్‌బాషా, అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషఫణి తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ మంత్రులు, కలెక్టర్‌, జేసీ అభినందించి సన్మానించారు.

విశిష్ట సేవలకు పురస్కారాలు: జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఉగాది ఉత్సవాల కార్యక్రమంలో పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ రంగంలో పగిడాల వెంకటేశ్వర్లు, విద్యారంగంలో వైష్ణవ వెంకటరమణ, పరిశ్రమల రంగంలో గెలివి రామకృష్ణ, క్రీడారంగంలో మల్లికార్జున, సామాజిక సేవారంగంలో నాగశేషులను సన్మానించారు.

Updated Date - Mar 31 , 2025 | 12:22 AM