Share News

Amaravati: వైద్య మిత్రల ఆందోళన

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:16 AM

వైద్య మిత్రలు మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత, మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ తదితర డిమాండ్లపై వారు నిరసన వ్యక్తం చేశారు

Amaravati: వైద్య మిత్రల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ భద్రత, మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ తదితర డిమాండ్లపై వైద్య మిత్రలు గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 500 మంది ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో 17 ఏళ్లుగా ఫీల్ట్‌ హోదాలో విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీన ట్రస్ట్‌ సీఈవోతో జరిపిన చర్చల్లో ఎలాంటి హామీ రాకపోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా క్షేత్రస్థాయి ఉద్యోగులకు క్యాడర్‌ లేదని, కనీస వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తమ గోడును వినిపించాలనే ఉద్దేశంతో నిరసనలు చేస్తున్నామని తెలిపారు. తమ సమస్యలపై అధికారులు స్పందించడం లేదని, పైగా ఒకరికి న్యాయం.. మరొకరికి అన్యాయం అన్నట్లు ప్రత్యేక జీవోలు సృష్టించి ఉద్యోగుల్లో కుమ్ములాటలు పెట్టి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమను ఇన్సూరెన్స్‌ కంపెనీల పరిధిలోకి పంపిస్తారేమోనన్న భయాందోళన ఉందన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 05:17 AM