Share News

పంజాన్‌ సందడి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:48 AM

పంజా సెంటర్‌లో రంజాన్‌ సంబరం అంబరాన్నంటుతోంది! విజయవాడ పాతబస్తీ పంజా సెంటర్‌ వీధులు తిరున ాళ్లను తలపిస్తున్నాయి.

పంజాన్‌ సందడి

ఆంధ్రజ్యోతి, వన్‌టౌన్‌

పంజా సెంటర్‌లో రంజాన్‌ సంబరం అంబరాన్నంటుతోంది! విజయవాడ పాతబస్తీ పంజా సెంటర్‌ వీధులు తిరున ాళ్లను తలపిస్తున్నాయి. ఉపవాస దీక్షలు ముగించుకున్న ముస్లిం సోదరులు సకుటుంబ సమేతంగా పంజా సెంటర్‌కు చేరుకుంటున్నారు. విందు, వినోదం, షాపింగ్‌తో హోరెత్తిస్తున్నారు. ఎటువైపు చూసినా వెరైటీలతో కూడిన మాంసాహార వంటకాల స్టాల్స్‌, చికెన్‌, మటన్‌ ఘుమఘుమలు పంజా వీధులను తాకుతున్నాయి. హలీం స్టాల్స్‌ గురించి అయితే చెప్పనక్కరలేదు. వస్త్ర దుకాణాల స్టాల్స్‌ వద్ద షాపింగ్‌ సందడి నెలకొంది. సేమ్యా, ఖర్జూరం, పండ్ల కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. విద్యుత్‌ దీపాలు, షామియానాలు, ఇతరత్రా అలంకారాలు, హలీం ఘుమఘుమలతో సాయంత్ర వేళ పంజా సెంటర్‌ తిరునాళ్లను తలపిస్తోంది. విద్యుద్దీపకాంతులు జిగేల్‌మంటూ ఓ కొత్త వాతావరణాన్ని రూపొందించాయి. మరికొద్ది రోజుల్లో ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. ముస్లిం సోదరులు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే అల్పాహారం తీసుకుని ఉపవాస దీక్ష ప్రారంభిస్తారు. తిరిగి సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్‌ విందు చేసుకుంటారు. ఈ క్రమంలోనే పండ్లు, డ్రై ప్రూట్స్‌, ఇతరత్రా ప్రత్యేకంగా తయారు చేసిన జ్యూస్‌ల వంటివి సేవిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా హలీంకు వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. హలీంకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి చేయి తిరిగిన వంట వారిని పిలిపించి ఘుమఘుమలాడే హలీంను సిద్ధంచేసి ముస్లిం సోదరులకు విక్రయించటం పంజా సెంటర్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఏ ఏటికాయేడు సరికొత్త హంగులతో స్టాళ్ల ఏర్పాటుతో కేవలం ముస్లిం సోదరులకే కాకుండా ఇతర జనాలను కూడా ఆకర్షిస్తున్నాయి. మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కుటుంబాలు హలీమ్‌ స్టాళ్లను సందర్శిస్తున్నారు. హలీంకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వంటకంలో ఆరోగ్య సంబంధిత మషాలాలను జోడిస్తారు. ఈ రుచికరమైన హలీంను ఎంతగానో ఇష్టపడతారు. సామాజిక పరివర్తనకు సంకేతంగా ఈ కలయికలను చూడవచ్చు. ఆరోగ్యపరంగానూ హలీం బెస్ట్‌. దీంతో ముస్లిం సోదరులతో పాటు ఇతరులు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వన్‌టౌన్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి హలీం స్టాళ్లను ఈ సెంటర్‌లో ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. చికెన్‌, మటన్‌, వెజ్‌లలో హలీం రకరకాలుగా లభిస్తుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా రుచికరమైన హైదరాబాదీ హలీం అంటే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. హలీం తయారీ కొంచెం కష్టమైన పనే. ఎక్కువగా చికెన్‌ హలీంని ఇష్టపడుతుంటారని స్టాల్స్‌ యజమానులు చెబుతున్నారు. చరిత్ర చూస్తే 1590లో అక్బర్‌ ఆస్థానంలోని అబుల్‌ ఫజల్‌ చక్రవర్తి హలీం మూలాలను రూపొందించినట్టుగా సమాచారం. ఈ వంటకాలను అప్పట్లో మూడు రకాలుగా వర్గీకరించారు. మాంసం లేని వంటకాలు, బియ్యం లేదా గోధుమ ఆధారిత వంటకాలు, మాంసం, రోటీతో వండీ హలీం ఇలా వర్గీకరణ చేసినట్టు చరిత్ర చెబుతుంది. ఉడికించిన మటన్‌, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటితో నెయ్యిని దట్టించి రుచికరంగా తయారు చేస్తారు. అందుకే హలీంను కేవలం ముస్లింలే కాకుండా ఇతరులు కూడా ఇష్టంతో తీసుకుంటారు. మరోవైపు గతంకంటే 15 నుంచి 25శాతం రేట్లు పెరిగాయి. సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, డ్రైప్రూట్స్‌, మటన్‌, వంటి వాటితో పాటు వంటవారికిచ్చే వేతనాలు పెరగటంతో ఆ మేరకు రేట్లు పెరిగాయని చెబుతున్నారు. ఒక బౌల్‌ మటన్‌తో తయారు చేసిన హలీం సుమారుగా రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. వంటలో వాడే పదార్థాలను బట్టి రేట్లను నిర్ణయిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు పంజా సెంటర్‌లో హలీం స్టాల్స్‌ జనాల రద్దీతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Updated Date - Mar 29 , 2025 | 12:48 AM