పరిహారంలో పంగనామ్‌ం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:49 PM
మేదరమెట్ల-నార్కెట్‌పల్లి (నామ్) రోడ్డులో అసంపూర్తి పనులు దశాబ్దకాలంగా అడుగుముందుకు పడలేదు. సుమారు 15 ఏళ్లుగా పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరగక ముందు 2010 జూలైలో హైదరాబాద్-విజయవాడ హైవేకు లింక్‌గా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి నుంచి అద్దంకి మీదుగా మేదరమెట్ల వద్ద చెన్నై-కోల్‌కత్తా హైవే వరకు కలిపేలా సుమారు 212 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.

మేదరమెట్ల-నార్కెట్‌పల్లి హైవే పనులూ 15 ఏళ్లుగా అసంపూర్తే
రోడ్డు ప్రారంభించాకే పలుచోట్ల వదిలేసిన పనులు
ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు
టోల్ ఫీజులు వసూలు ప్రారంభించి దశాబ్దకాలం
రైతులకు ఇంకా చెల్లించిన నష్టపరిహారం
అద్దంకి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : మేదరమెట్ల-నార్కెట్‌పల్లి (నామ్) రోడ్డులో అసంపూర్తి పనులు దశాబ్దకాలంగా అడుగుముందుకు పడలేదు. సుమారు 15 ఏళ్లుగా పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరగక ముందు 2010 జూలైలో హైదరాబాద్-విజయవాడ హైవేకు లింక్‌గా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి నుంచి అద్దంకి మీదుగా మేదరమెట్ల వద్ద చెన్నై-కోల్‌కత్తా హైవే వరకు కలిపేలా సుమారు 212 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
నిలిచిన పనుల్లో అద్దంకిలో సింహభాగం
నామ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిలిచిపోయిన పనులలో అత్యధికశాతం అద్దంకి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. అద్దంకి పట్టణంతో పాటు అద్దంకి మండలం గోపాలపురం, చక్రాయపాలెం, సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. అద్దంకి పట్టణం మధ్య నుంచి వెళ్లే రోడ్డు తొలుత ప్రకటించిన అలైన్‌మెంట్ మార్పు చేసి పాతరోడ్డులోనే కొనసాగించారు. అదేసమయంలో గోపాలపురం, చక్రాయపాలెం, ఏల్చూరు వద్ద భూసేకరణ పూర్తికాకపోవడంతో రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. గోపాలపురం వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టకుండా వదిలివేయటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ వరకు వేగంగా వచ్చిన వాహనాలు గుంతల రోడ్డు, స్పీడ్ బ్రేకర్లు గుర్తించకుండా ముందుకు పోతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అసంపూర్తిగా రోడ్డు వదిలివేసిన ప్రాంతంలో డైవర్షన్ బోర్డులు, టోల్ రోడ్డు ముగిసింది అని బోర్డులు పెట్టి వదిలేయడం గమనార్హం. ఆయా ప్రాంతాలలో కనీసం పూర్తి స్థాయిలో మరమ్మతులు కూడా చేపట్టకపోవటంతో వాహనచోదకులు మరింత ఇబ్బంది పడుతున్నారు.
పదేళ్ల నుంచి టోల్ మాత్రం పకడ్బందీగా వసూళ్లు
2014 సంవత్సరం నాటికి సుమారు 190 కి.మీ మేర పనులు పూర్తికావటంతో నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తుమ్మలచెరువు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏల్చూరు వద్ద టోల్ గేట్‌లు ఏర్పాటుచేశారు. సుమారు దశాబ్దకాలంనాడు టోల్ గేట్‌లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. అనంతరం పలు సందర్భాలలో 13.425 కిలోమీటర్ల దూరం పనులు పూర్తి చేశారు. మొత్తమ్మీద సుమారు ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరం పనులు నిలిచిపోయాయి.
మంత్రి హామీ ఇచ్చినా తొమ్మిది నెలల్నుంచి కదలని అధికారులు
సుమారు 14ఏళ్లుగా పరిహారం కోసం రైతులు ఎదురు చూస్తునే ఉన్నారు. పలు సందర్భాలలో పరిహారం కోసం రైతులు రోడ్డెక్కినా ఫలితం కనిపించలేదు. వైసీపీ ప్రభుత ్వ హయాంలో రైతుల గోడు అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో నిర్వహించిన తొలి సమీక్షలో పరిహారం చెల్లింపుపై అధికారులు చొరవ తీసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో రైతులలో ఆశలు చిగురించాయి. 9 నెలలు అయినా అధికారులలో మాత్రం కదలిక రాలేదు. దీంతో రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. ఇప్పటికైనా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరింత చొరవ తీసుకొని రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని వాహనచోదకులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.