ఏసీబీ వలలో ప్రిన్సిపాల్
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:24 AM
లంచం తీసుకుంటూ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఏసీబీకి చిక్కారు. తన పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అటెండర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం చీమకుర్తిలో చోటుచేసుకుంది.

డబ్బులిస్తేనే జీతం బిల్లు చేస్తానని డిమాండ్
అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన అటెండర్
చీమకుర్తిలోని నివాసంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
ఆయనపై ఇప్పటికే పలు ఆరోపణలు
చీమకుర్తి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : లంచం తీసుకుంటూ గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఏసీబీకి చిక్కారు. తన పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అటెండర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం చీమకుర్తిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శిరీష కథనం ప్రకారం.. చీమకుర్తి పట్టణంలో గరికమెట్ట వద్ద ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఎం.ప్రవీణ్‌కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా వీరయ్య విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా వేసవి సెలవుల్లో పనిచేసినందుకు రెండు నెలలపాటు వచ్చే జీతానికి బిల్లులు పంపించాలంటే ఒక నెల జీతం తనకివ్వాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు. దీంతో వీరయ్య అంతమొత్తం ఇచ్చుకోలేక ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన ప్లాన్ ప్రకారం శనివారం చీమకుర్తి పట్టణంలో తూర్పుబజార్‌లో నివాసం ఉంటున్న ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ ఇంటికి వెళ్లిన వీరయ్య రూ.17,500ను ఇచ్చారు. అదే సమయంలో అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ప్రవీణ్‌కుమార్‌ని పట్టుకున్నారు. అక్కడి నుంచి అతనిని పాఠశాలకు తరలించారు. తదుపరి ఒంగోలుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ప్రిన్సిపల్ వైఖరిపై పలు ఆరోపణలు...
ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్‌పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయప్రతాపరెడ్డి పాఠశాలను సందర్శిఽంచారు. నాసిరకం బియ్యం, సరుకులతో వంటలు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నట్లు ఆయన గుర్తించారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న ఆయాకు జీతం చేసినందుకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.