Share News

ఎన్టీఆర్‌ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:27 AM

ఒంగోలు నగరంలోని 37వ డివిజన్‌లో కీలక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు కార్పొరే షన్‌ అధికారులు చర్యలు ప్రారంభించారు. తొలిగా ఆ డివిజన్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది వచ్చి వాకింగ్‌ చేసే ఎన్టీఆర్‌ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఎన్టీఆర్‌ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎన్టీఆర్‌ పార్కులో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఏఈ చంద్రయ్య, కార్పొరేటర్‌ చెన్నుపాటి వేణుగోపాల్‌

రూ.20.80 లక్షలతో లెవలింగ్‌, ట్రాక్‌ ఆధునికీకరణ

ప్రారంభించిన కమిషనర్‌ వెంకటేశ్వరరావు

మొత్తం రూ.93.85 లక్షలతో వివిధ రకాల పనులు

మూడొంతులకు టెండర్లు పూర్తి

వచ్చేనెలలో వాటినీ చేపట్టేలా కార్యాచరణ

ఎమ్మెల్యే జనార్దన్‌ ఆదేశాలతో కదలిక

ఒంగోలు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలోని 37వ డివిజన్‌లో కీలక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు కార్పొరే షన్‌ అధికారులు చర్యలు ప్రారంభించారు. తొలిగా ఆ డివిజన్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది వచ్చి వాకింగ్‌ చేసే ఎన్టీఆర్‌ పార్కులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా అవసరమైన పార్కులో లెవలింగ్‌, రెండువై ౖపులా వాకింగ్‌ ట్రాక్‌ ఆధునికీకరణ పనులను చేపట్టారు. సుమారు రూ.20.80 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను నగర పాల క సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు శనివారం ప్రారంభిం చారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం, సదుపాయాల మెరుగు లక్ష్యంగా ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ పేరుతో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చావేదికలను నిర్వహించిన విషయం విదితమే. అందులోభాగంగా జనవరి 28న నగరంలోని 37వ డివిజన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ పార్కులో ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మేయర్‌ గంగాడ సుజాత, కమిషనర్‌ వెంకటేశ్వరరావులు పాల్గొనగా 37వ డివిజన్‌లోని వివిధ కాలనీలకు చెందిన ఐదారు వందల మంది ప్రజానీకం హాజరయ్యారు. తమ ప్రాంత సమస్యలను, మౌలిక సదుపాయాల మెరుగు అంశాలను ఆంధ్రజ్యోతి చర్చావేదికలో వారి దృష్టికి తీసుకొని రాగా కొన్నింటిపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వారికి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. తక్షణ పనులపై ఎమ్మెల్యే ఆదేశాలతో కార్పొరేషన్‌ అధికారులు తొలుత ఆ ప్రాంతంలో శానిటేషన్‌ మెరుగు, ఆక్రమణల తొలగింపు పనులు చేశారు. ఆయా ప్రాంత ప్రజలు కోరిన పనులలో ప్రాధాన్యత గల వాటిని గుర్తించారు. సుమారు రూ.93.85 లక్షలతో 13 పనులకు ప్రతిపాదనలు తయారు చేశారు. దాదాపు ఇప్పటికే వాటిలో మూడొంతుల పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిచేశారు.

వాకింగ్‌ ట్రాక్‌ల ఆధునికీకరణ

37వ డివిజన్‌ ప్రజలందరి ఉమ్మడి అవసరాలలో కీలకమైన ఎన్టీఆర్‌ పార్కులో మూడు భాగాలుగా రూ.20.80 లక్షలతో లెవలింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌ల ఆధునికీకరణ పనులకు టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్‌ వర్క్‌ ఆర్డర్‌ వారంరోజుల క్రితం ఇచ్చారు. ఆ పనులను శనివారం ఉదయం కార్పొరేషన్‌ కమిషనర్‌ కోడూరి వెంకటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్‌ చెన్నుపాటి వేణుగోపాలరావు, మునిసిపల్‌ ఇంజనీర్‌ చంద్రయ్య, వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెన్నుపాటి ప్రసాదరావు, గణపతి మాస్టారు, మన్నం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పనులను పది రోజుల్లో పూర్తిచేయాలని కమిషనర్‌ ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. డివిజన్‌లో ప్రతిపాదించిన ఇతర రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు, పార్కులో ఆట స్థలంలో కొత్త పరికరాల ఏర్పాటు తదితరాలపై దృష్టిసారించి కొద్దిరోజుల్లోనే వాటిని కూడా పూర్తి చేస్తామని కమిషనర్‌ తెలిపారు. కాగా పార్కులో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అక్కడి వాటర్‌ ట్యాంకు ప్రాంతాన్ని కమిషనర్‌ పరిశీలించారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వాటర్‌ ట్యాంకు మెట్లపైకి ఇతరులు ఎక్కే అవకాశం లేకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కమిషనర్‌ ఆదేశించారు.

Updated Date - Mar 23 , 2025 | 01:27 AM