వాన నీటిని ఒడిసిపడదాం
ABN , Publish Date - Mar 23 , 2025 | 02:13 AM
జిల్లాలో అత్యధిక ప్రాంతం వర్షాధారమే! అన్నిచోట్లా అరకొర నీటి సౌకర్యాలే! సరైన వానలు లేక ఏటా కరువు బారిన పడుతూ సాగుకే కాక తాగు, ఇతర సాధారణ అవసరాలకు కూడా నీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రజల నీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

జిల్లాఅంతటా భారీగా నీటి సంరక్షణ పనులు
ఉపాధి పథకంతో అనుసంధానం
పంట కుంటలు, ఇంకుడు గుంతలు,
చెరువుల ఆధునికీకరణ పనులు ప్రారంభం
జలదినోత్సవం సందర్భంగా పంట కుంటల తవ్వకాలకు శ్రీకారం
కనుమళ్లలో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్ అన్సారియా
ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రం ప్రారంభం
జిల్లాలో అత్యధిక ప్రాంతం వర్షాధారమే! అన్నిచోట్లా అరకొర నీటి సౌకర్యాలే! సరైన వానలు లేక ఏటా కరువు బారిన పడుతూ సాగుకే కాక తాగు, ఇతర సాధారణ అవసరాలకు కూడా నీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రజల నీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించింది. వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ మేరకు పొలాల్లో భారీగా పంట కుంటలు తవ్వాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి కరువు బారిన పడుతున్న జిల్లాలో పెద్దఎత్తున నీటి సంరక్షణ పనులకు శనివారం శ్రీకారం చుట్టింది. మంత్రి స్వామి, కలెక్టర్ అన్సారియా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పంట కుంట తవ్వకాన్ని ప్రారంభించారు.
ఒంగోలు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): వాన నీరు వృథా కాకుండా ఒడిసి పట్టే లక్ష్యంతో చిన్న, మధ్య తరహా స్థాయిలో కుంటల తవ్వకా లను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పొలాల్లో అన్ని అవసరాలకు ఉపకరించేలా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55వేల పంట కుంటల (ఫాం పాండ్స్)ను 2025-26 ఆర్థిక సంవత్సరంలో తవ్వాలని నిర్ణయించారు. అలాగే ఇళ్లు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు, ఊరూరా ఉండే చెరువులు, కుంటలలో పూడికతీత, ఇతర ఆధునికీకరణతోపాటు పది రకాల నీటి సంరక్షణ పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో 380 గ్రామాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయినట్లు కేంద్రం గుర్తించగా అందులో అత్యధికంగా జిల్లాలోనే 93 ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో భారీగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ అన్సారియా, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ కార్యాచరణ రూపొందించారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నీటి సంరక్షణ పనులకు శ్రీకారం చుట్టింది. తొలుత పొలాల్లో పంట కుంటలపై దృష్టి పెట్టింది. సంబంధితశాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పంట కుంటల తవ్వకం పనులు ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులు ప్రాధాన్యత ఉన్న జిల్లాల్లో అక్కడి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
కనుమళ్లలో ప్రారంభం
జిల్లాలో శనివారం పంట కుంటల తవ్వ కాల పనులకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో లక్షా 55వేల పంట కుంటలు లక్ష్యం కాగా జిల్లాలో 9,500 తవ్వాలని నిర్ణయిం చారు. సగటున ఒక్కో కుంట తవ్వకానికి రూ.50వేల వరకు ఉపాధి హామీ పథకం కింద రైతులకు ఇవ్వనున్నారు. జిల్లావ్యా ప్తంగా శనివారం ఈ పనులను జల దినో త్సవం సందర్భంగా డ్వామా ఆధ్వర్యంలో చేపట్టగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి పంట కుంటల తవ్వకం పనులు ప్రారంభించారు. కలెక్టర్ అన్సారియా, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ పాల్గొన్నారు. అక్కడ రూ.2.32లక్షలతో తవ్విన మోడల్ పంట కుంటను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ పనులను ప్రారం భించారు. పెద్దారవీడు మండలం శివాపురంలో పంటకుంట తవ్వకం పనులను ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ప్రారంభించగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ డ్వామా సిబ్బంది నేతృత్వంలో ఈ పనులు మొదలయ్యాయి.
నీటి సమస్య పరిష్కారం, సంరక్షణ పనుల పర్యవేక్షణ లక్ష్యంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆలోచన మేరకు ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రం పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జలదినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి ఆ కేంద్రాన్ని ప్రారంభించగా కలెక్టర్ అన్సారియా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌లు పాల్గొన్నారు. జిల్లాలో నీటి వనరులు, భూగర్భ జలాల స్థితిగతులు, వాటిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా చేపట్టే పనుల నమూనాలు ఇందులో ఉంటాయి. డ్వామా సిబ్బందితోపాటు ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రౌండ్‌వాటర్ ఇతర సిబ్బంది సమన్వయంతో ఈ కేంద్రం నడవనుంది. అన్నిరకాల నీటి సమస్యలను ఈ కేంద్రం వారు తీసుకోనే కాల్ సెంటర్ లాగా కూడా ఇది ఉపకరించనున్నట్లు సమాచారం.