Share News

స్కూల్‌ గ్రాంట్‌ వినియోగంలో నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:22 AM

కాంపోజిట్‌ స్కూలు గ్రాంట్‌ విడుదల చేయకపోతే పాఠశాలల నిర్వహణ ఎలా అని ప్రధానోపాధ్యాయులు గతంలో గగ్గోలు పెట్టారు. తీరా విడుదల చేస్తే నిధుల వినియోగించడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో 87 పాఠశాలలకు విడుదల చేసి సుమారు రూ.9లక్షలు వెనక్కు వెళ్లే ప్రమాదం ఏర్పడింది.

స్కూల్‌ గ్రాంట్‌ వినియోగంలో నిర్లక్ష్యం

రూ.9లక్షలు వెనక్కు వెళ్లే ప్రమాదం

87 పాఠశాలల హెచ్‌ఎంల నిర్వాకం

ఒంగోలు విద్య, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కాంపోజిట్‌ స్కూలు గ్రాంట్‌ విడుదల చేయకపోతే పాఠశాలల నిర్వహణ ఎలా అని ప్రధానోపాధ్యాయులు గతంలో గగ్గోలు పెట్టారు. తీరా విడుదల చేస్తే నిధుల వినియోగించడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో 87 పాఠశాలలకు విడుదల చేసి సుమారు రూ.9లక్షలు వెనక్కు వెళ్లే ప్రమాదం ఏర్పడింది. నెలాఖరు లోగా ఆ నిధులను వినియోగించకపోతే ఆ మొత్తాలను పాఠశాలలు వదులుకోవాల్సిందే. ప్రభుత్వ రంగంలోని 1 నుంచి 12 తరగతుల వరకూ విద్యార్థులు ఉన్న విద్యా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంటు పేరుతో మౌలిక వసతులకు నిధులు విడుదల చేస్తున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా వీటిని ఇస్తున్నాయి. 2023-24 విద్యాసంవత్సరంలో జిల్లాలోని పాఠశాలలకు ఈ నిధుల కింద ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. ప్రస్తుత విద్యా సంవత్స రంలో రాష్ట్రప్రభుత్వం పాఠశాలలకు రావాల్సిన కాంపోజిట్‌ గ్రాంట్‌లో 50శాతం విడుదల చేసింది. గత ఏడాది నిధులు లేక పాఠశాలల కనీస అవసరాలకు తమ జేబులోని డబ్బులు పెట్టామని గగ్గోలు పెట్టిన హెచ్‌ఎంలు ఈ ఏడాది నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో పాఠశాలలకు సమగ్ర శిక్ష ద్వారా రూ.2.81కోట్లు విడుదల చేశారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఎస్‌ఎంసీ సమావేశంలో చర్చించి తీర్మానాలు చేయాలి. వాటికి అనుగుణంగా చేపట్టే పనులు, కొనుగోలు చేసే మెటీరియల్‌కు సంబంధించిన అంచనాలను ముం దుగా హెచ్‌ఎంలు పీఎంసీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దానికి అనుగుణంగా ప్రింట్‌ పేమెంట్‌ అడ్వయిస్‌(పీపీఏ) తయారు చేసి సంబంధిత మండల విద్యాధికారి ధ్రువీకరణతో పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా బ్యాంకుకు సమర్పిస్తే నిధులు హెచ్‌ఎం, ఎస్‌ఎంసీ జాయింట్‌ ఖాతాకు జమ అవుతాయి. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులు, ఓచర్లు కూడా యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ నిధుల వినియోగానికి ఇంత తతంగం ఉండగా ఇప్పటివరకు 87 పాఠశాలలకు సంబంధించి విడుదలైన రూ.9 లక్షల్లో ఒక్క పైసా కూడా ఇప్పటివరకూ ఖర్చుచేయలేదు. ఇప్పటికైనా తొందరపడకపోతే ఆ నిధులను వదుకో వాల్సిందే.

Updated Date - Mar 23 , 2025 | 01:22 AM