Share News

వైసీపీ ఖాతాలోనే ఎంపీపీలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:56 AM

మార్కాపురం మండల ఎంపీపీగా తిప్పాయపాలెం వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు బండి లక్ష్మీదేవి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు.

వైసీపీ ఖాతాలోనే ఎంపీపీలు

మార్కాపురం రూరల్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి). మార్కాపురం మండల ఎంపీపీగా తిప్పాయపాలెం వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు బండి లక్ష్మీదేవి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ ఎన్నిక డీఎల్‌డీవో, రిటర్నింగ్‌ అధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో శ్రీని వాసులు నిర్వహించారు. మార్కాపురం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గోగులదిన్నె ఎంపీటీసీ సభ్యులు రాజీనామా చేయగా, నికరంపల్లి ఎంపీటీసీ సభ్యులు మృతిచెందారు. దీంతో 13 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఉన్నారు. గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికలో 13 మంది సభ్యులు హాజరయ్యారు. వారిలో తిప్పాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు బండి.లక్ష్మీదేవిని హజరైన ఎంపీటీసీలం దరూ కలిసి ఏకగ్రీవ్రంగా ఎన్నుకున్నారు. సీఐ సుబ్బా రావు, రూరల్‌, పట్టణ ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిం చారు. ఎంపీపీగా ఎన్నికైన బండి లక్ష్మీదేవిని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నా.రాంబాబు, ముఖ్య నాయకులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక గురువారం నిర్వహిం చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సభ్యుల మద్దతుతో సయ్యద్‌ ఎన్నికయ్యారని ఎన్నికల అదికారి ఏ.విష్ణువర్ధన్‌రావు తెలిపారు. మండలంలో 18 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా 10 మంది వైసీపీ, 8 మంది టీడీపీ సభ్యులు ఉన్నారన్నారు. వైసీపీ నుంచి సయ్యద్‌ సాధిక్‌, టీడీపీ నుంచి షేక్‌ చిన్నఖాశీంలు నామినేషన్‌ వేశారు. ఈ ఎన్నికల్లో సాధాక్‌ గెలుపొందాడు.

పుల్లలచెరువు : మండల ప్రజాపరిషత్‌ వైస్‌ ఎంపీపీగా వైసీపీకి చెందిన లింగంగుంట్ల రాములు ఎన్నికయ్యారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి దేవేంద్రకుమార్‌, ఎంపీడీవో వసంత రావు సభ్యులకు బహిరంగ ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, 14 మంది హాజరయ్యారు. కాగా టీడీపీకి ఏడుగురు, వైసీపీకి ఏడుగురు సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపారు. గంగవరం ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌కు హజరు కాలేదు. దీంతో అధికారులు లాటరీ నిర్వహించారు. మల్లాపాలెం ఎంపీటీసీ సభ్యుడు రాములు లాటరీలో విజయం సాధించాడు.

త్రిపురాంతకం : కేసులు, వ్యూహాలు, ఆరోపణల నడుమ తీవ్ర ఉత్కంట రేపిన త్రిపురాంతకం ఎంపీపీ పీఠం ఎట్టకేలకు వైసీపీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా మండలంలోని 18 ఎంపీటీసీలకు గానూ 17 మంది హాజరయ్యారు. జి.ఉమ్మడివరం ఎంపీటీసీ సభ్యుడు ఆళ్ల ఆంజనేయరెడ్డి రిమాండు ఖైదీగా ఉండడంతో ఎన్నికకు హాజరుకాలేదు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్‌ కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. కాగా రిటర్నింగ్‌ అధికారి వండర్‌మ్యాన్‌ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగానే సోమేపల్లి ఎంపీటీసీ ఆళ్ళ సుబ్బమ్మను ఎంపీపీ అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు విశ్వనాథపురం ఎంపీటీసీ సభ్యుడు జి.ముసలయ్య ప్రతిపాధించారు. మిరియంపల్లి ఎంపీటీసీ శాయపనేని సుబ్బారావు బలపరిచారు. సుబ్బమ్మకు తొమ్మిదిమంది మద్దతుగా చేతులెత్తారు. అనంతరం వైసీపీ రెబల్‌ అభ్యర్ధిగా ఉన్న రాజుపాలెం ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జ్యోతిని ఎంపీపీ అభ్యర్థిగా ప్రతిపాదిసున్నట్లు నడిగడ్డ ఎంపీటీసీ సభ్యుడు కోట్ల సుబ్బారెడ్డి ప్రతిపాధించారు. గొల్లపల్లి ఎంపీటీసీ ఎనిబెర ఎసేబు బలపరిచారు. చల్లా జ్యోతికి మద్దతుగా ఎనిమిది మంది సభ్యులు చేతులెత్తారు. దీంతో ఒక ఓటు అదనంగా రావడంతో ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైనట్లు ఆర్‌వో వండర్‌మ్యాన్‌ ప్రకటించారు. అనంతరం బయటకు వచ్చిన చల్లా జ్యోతి తమ వర్గంలోని ఎంపీటీసీలను ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ప్రలోభాలకు గురిచేశారని, తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ముగించుకుని గెలుపొందిన ఎంపీపీ సుబ్బమ్మ, ఎంపీటీసీలతో బయటకు వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించాలని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు 144 సెక్షన్‌, బందోబస్తు నిర్వహించారు.

కంభం : కంభం మండలం తురిమెళ్ల మేజర్‌ పంచాయతీ ఉపసర్పంచ్‌గా ఏలం వెంకటేశ్వర్లు (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విజయలక్ష్మి తెలిపారు. గతంలో ఉప సర్పంచ్‌గా ఉన్న షేక్‌ జిలాకాభీ వ్యక్తిగత కారణాలతో ఉపసర్పంచ్‌ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎన్నికకు తురిమెళ్ల సర్పంచ్‌ మాదా సుభద్ర, ఏడుగురు వార్డుసభ్యులు హాజరయ్యారు. 9వ వార్డుకు చెందిన ఏలం వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకో వడంతో వెంకటేశ్వర్లుతో ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణపత్రం అందచేసినట్లు విజయలక్ష్మి తెలి పారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రాచారి, పంచాయతీ కార్యదర్శి ఎ.ఆంజనేయులు, మాజీసర్పంచ్‌ నారిశెట్టి వీరమ్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 08:52 AM