Share News

గ్రానైట్‌ ఆక్రమణలపై కదిలిన యంత్రాంగం

ABN , Publish Date - Mar 27 , 2025 | 02:22 AM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జా చేశారు. క్వారీల యజమానులు ఆయా భూములను లీజుల పేరుతో సొంతం చేసుకున్నారు. అదేక్రమంలో కొందరు వాటిలో డంప్‌లు పోసుకుంటున్నారు. ఇలా అన్యాక్రాంతమైన భూముల విషయంలో ఎట్టకేలకు యంత్రాంగం కదిలింది. పరిశీలనకు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సిద్ధమయ్యారు.

గ్రానైట్‌ ఆక్రమణలపై కదిలిన యంత్రాంగం

విలువైన ప్రభుత్వ భూముల్లో డంప్‌లు ఏర్పాటు చేసిన యజమానులు

తనిఖీలకు సిద్ధమైన రెవెన్యూ, మైన్స్‌ అధికారులు

ఒంగోలు క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జా చేశారు. క్వారీల యజమానులు ఆయా భూములను లీజుల పేరుతో సొంతం చేసుకున్నారు. అదేక్రమంలో కొందరు వాటిలో డంప్‌లు పోసుకుంటున్నారు. ఇలా అన్యాక్రాంతమైన భూముల విషయంలో ఎట్టకేలకు యంత్రాంగం కదిలింది. పరిశీలనకు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఆయావర్గాల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. దాదాపుగా 1980 నుంచి చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడలలో గ్రానైట్‌ పరిశ్రమ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రభుత్వ భూముల కబ్జా పర్వం కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఆక్రమణలు జరుగుతున్నా అటువైపు అధికారులు కన్నెతి చూడటం లేదు. ఏదైనా పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు కొద్దిరోజులు హడావుడి చేసి ఆతర్వాత వదిలేస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా క్వారీల హద్దులు కూడా సక్రమంగా నిర్ణయించలేకపోతున్నారు. గ్రానైట్‌ క్వారీలు నిర్వహించే భూముల్లో ఎక్కువ అసైన్‌మెంట్‌వి ఉండటం గమనార్హం. లీజుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని క్వారీ యజమానులు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల సమాచార హక్కు కార్యకర్త దాఖలు చేసిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించారు. ముఖ్యంగా చీమకుర్తి సర్వే నంబరు 584/2లో ప్రభుత్వ భూమిని క్వారీ యజమానులు ఆక్రమించుకున్నారని స్పష్టమైన ఫిర్యాదుతో కదలిక వచ్చింది. ఆ భూముని ఆక్రమించిన క్వారీ యజమానులకు నోటీసులు జారీచేశారు. జిల్లా గనులు, భూగర్భశాఖ, రెవెన్యూ యంత్రాంగం కలిసి గ్రానైట్‌ క్వారీలలో సంయుక్త తనిఖీలు చేసేందుకు నిర్ణయించారు. మంగళవారం తనిఖీలు చేసేందుకు సిద్ధమైన యంత్రాంగం ఎందుకో ఆగిపోయింది. మరి ఇవి ఎప్పుడు జరుగుతాయో ఉన్నతాధికారులకే తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 27 , 2025 | 02:22 AM