‘బంగారు బాల్యం’కు స్కోచ్ అవార్డు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:33 AM
జిల్లాలో అమలవు తున్న బంగారు బాల్యం కార్యక్రమానికి కలెక్టర్ తమీమ్ అన్సారియాకు స్కోచ్ అవార్డు లభించింది. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును నిర్వాహకుల నుంచి ఆమె అందుకున్నారు.

ఢిల్లీలో అందుకున్న కలెక్టర్ అన్సారియా
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అమలవు తున్న బంగారు బాల్యం కార్యక్రమానికి కలెక్టర్ తమీమ్ అన్సారియాకు స్కోచ్ అవార్డు లభించింది. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును నిర్వాహకుల నుంచి ఆమె అందుకున్నారు. కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా గతేడాది జూన్ 27న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లాపై అవగాహన కోసం విస్తృతంగా పర్యటనలు చేశారు. పశ్చిమప్రాంతంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. బాలికల్లో పౌష్టికాహార లోపం ఉండటాన్ని కూడా గమనించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగారు బాల్యం పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థి, మంత్రి డాక్టర్ స్వామి ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు 29న ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బాల్యవివాహాల నిరోధంతోపాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై విస్తృత ప్రచారం చేయించారు. వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలతోపాటు పలు రంగాల ప్రముఖులను కూడా భాగ స్వామ్యం చేశారు. కార్యక్రమం గురించి ఐసీడీఎస్ ద్వారా కలెక్టర్ స్కోచ్ సంస్థకు పంపారు. బంగారు బాల్యం నేపథ్యం, లక్ష్యాలు, అమలు తీరు, సాధిస్తున్న పురోగతిని ఆ సంస్థ ప్రతినిధులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. మరోవైపు కలెక్టర్ ప్రజెంటేషన్‌తోపాటు ప్రజాభిప్రాయం, నిపుణుల ఓటింగ్‌ను కూడా ఈ సంస్థ పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వచ్చేలా కృషి చేసిన కలెక్టర్ అన్సారియాకు మంత్రి స్వామితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.