Share News

ఆవిర్భావ సంబరం

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:39 AM

జిల్లావ్యాప్తంగా శనివారం పసుపు జెండాలు రెపరెపలాడాయి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఊరూవాడా వేడుకలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.

ఆవిర్భావ సంబరం
మర్రిపూడిలో టీడీపీ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి స్వామి, పార్టీ నాయకులు, ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎంపీ మాగుంట, నాయకులు

జిల్లా అంతటా ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు

ముఖ్య నాయకులు హాజరు

జెండా ఆవిష్కరణలు, కేక్‌ కటింగ్‌లు

పలుచోట్ల అన్నదానాలు

మహానేత ఎన్టీఆర్‌కు నివాళులు

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందన్న నేతలు

జిల్లావ్యాప్తంగా శనివారం పసుపు జెండాలు రెపరెపలాడాయి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఊరూవాడా వేడుకలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనాయకులు హాజరయ్యారు. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరణలు, కేక్‌ కటింగ్‌లు చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించి పార్టీ ఘనకీర్తిని, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఒంగోలు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నాలుగు దశాబ్దాలకుపైగా ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ పాత్రను ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో పార్టీ నేతలు శ్లాఘించారు. అలాగే రాష్ట్రంలో.. ప్రత్యేకించి జిల్లాలో ప్రజల సంక్షే మం, అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన కార్యక్రమాలను వివరిం చారు. సాగు, తాగునీటి రంగాలతోపాటు విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక రంగాలలో ప్రగతి టీడీపీ కాలంలోనే జరిగిందని గుర్తుచేశారు. పేదరిక నిర్మూలనే అంతిమ లక్ష్యంగా రాష్ట్రంలో టీడీపీ చేపడుతున్న ప్రణాళికాబద్ధ కార్యక్రమాలను వివరించారు. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు నిలయంగా గత వైసీపీ పాలన సాగిందన్నారు. దాని నుంచి విముక్తి కల్పించేందుకు ప్రజల పక్షాన టీడీపీ నిలిచి విజయం సాధించిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వైసీపీ వంటి పార్టీకి, జగన్‌లాంటి నాయకులకు స్థానం లేకుండా చేయాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.

వేడుకల్లో పాల్గొన్న మంత్రి

జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్ర మాల్లో మంత్రి నుంచి సాధారణ కార్యకర్త వరకూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి తన స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో జెండా ఆవిష్కరణతోపాటు ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం నియోజకవర్గంలోని మండల కేంద్రాలైన పొన్నలూరు, మర్రిపూడిలో ఏర్పాటు చేసిన జరిగిన పాల్గొన్నారు. అదే నియోజకవర్గానికి చెందిన మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ తొలుత మంత్రి స్వామితోపాటు స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కొండపి, సింగరాయకొండ, టంగుటూరులో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఒంగోలులో ఎంపీ మాగుంట

ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలులో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తొలుత భాగ్యనగర్‌ మూడో లైనులోని టీడీపీ పార్లమెంట్‌ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్‌ అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ మద్దిపాడులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న 39వ డివిజన్‌లో జెండా ఆవిష్కరణతోపాటు టీడీపీ మహిళా నాయకురాలు ఆరికట్ల సుమతి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు.


ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల హాజరు

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆ నియోజకవర్గంలోని వెలిగండ్ల, సీఎస్‌పురం, పీసీపల్లిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనగా గిద్దలూరు ఎమ్మెల్యే ఎం.అశోక్‌రెడ్డి పట్టణంలోని అన్న క్యాంటీన్‌ వద్ద టీడీపీ జెండాను ఆవిష్కరించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, పార్టీ నేత లలిత్‌సాగర్‌లు దర్శి, ముండ్లమూరు, దొనకొండలలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు వైపాలెంలో జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అలాగే జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ మన్నె రవీంద్ర వైపాలెంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండు సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే పలు ఇతర మండల కేంద్రాలు, పట్టణాలతోపాటు అనేక గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.

Updated Date - Mar 30 , 2025 | 01:39 AM