ప్రణాళికాబద్ధంగా ‘ఉపాధి’ పనులు
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:54 AM
జిల్లాలో రానున్న మూడు నెలల్లో ఉపాధి హామీ పథకం పనులను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 1.11 కోట్ల పనిదినాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాలి
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రానున్న మూడు నెలల్లో ఉపాధి హామీ పథకం పనులను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 1.11 కోట్ల పనిదినాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 7వతేదీ నుంచి జిల్లాలో రోజువారీ 1.96 లక్షల మంది కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. స్థానిక జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో శనివారం ఏపీడీలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్లలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా ఐదు రకాల పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో రూ.4.72 కోట్ల వ్యయంతో 1,475 పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులను సమన్వయం చేసుకొని ఈ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో రూ.47.50 కోట్ల వ్యయంతో 9,500 సేద్యపు నీటి కుంటలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని చెప్పారు. అందులో రోజువారీ పనులు కోరే కూలీలకు కూడా 15 నుంచి 20శాతం వరకు పనులు కేటాయించామన్నారు. జిల్లాలో రూ.101.70 కోట్ల అంచనా వ్యయంతో 4,043 కి.మీ ఫీల్డ్ చానల్, ఫీడర్ చానల్‌లో పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. 546 చెరువులలో రూ. 54.60 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధి కూలీ రోజుకు కనీస వేతనం రూ.290 పొందే విధంగా డ్వామా అధికారులు, సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ పాల్గొన్నారు.