రియల్ బూస్ట్
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:49 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో రైతులు, పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కంచికచర్ల మండలంలో కృష్ణానది తీర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4 నెలల క్రితం ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేశాడు. అయితే రెవెన్యూ అధికారుల నుంచి ముప్పతిప్పలు ఎదుర్కొన్నాడు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరికి తనకు తెలిసిన మంత్రిని ఆశ్రయించాడు. ఆయన జోక్యంతోనే కన్వర్షన్ సర్టిఫికెట్ లభ్యమైంది.
జగ్గయ్యపేట పరిసరాల్లో 8 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఓ పారిశ్రామిక వేత్త ముందుకొచ్చాడు. వ్యవసాయ భూమిని పరిశ్రమకు వినియోగించేందుకు కన్వర్షన్ చేసుకోవాల్సి ఉండగా, నాలా ఫీజుగా రూ.3.15 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేస్తే, రెవెన్యూ అధికారులకు పండగే. అవసరమైన సర్టిఫికెట్ త్వరగా పొందాలంటే లంచం తప్పదు. భూమిని ప్లాట్లుగా మార్చి రోడ్లు వేస్తే, అడిగినంత చెల్లించాల్సిందే. లేకపోతే అనుమతి కోసం కాలయాపన తప్పదు
కంచికచర్ల - ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో రైతులు, పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని, ఇప్పుడు రియల్ ఎస్టేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వేగంగా పురోగమిస్తాయని అభిప్రాయపడుతున్నారు. 1963లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి న ఈ చట్టం ప్రకారం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసె్‌సమెంట్ (నాలా) ఫీజు చెల్లించడం తప్పనిసరి. గతంలో భూమి విలువలో (రిజిస్ట్రేషన్ వాల్యూ) 3 శాతంగా ఉన్న ఫీజును వైసీపీ ప్రభుత్వం 5 శాతానికి పెంచింది. ఈ చట్టాన్ని కొంతమంది రెవెన్యూ అధికారులు లంచాలకు వేదికగా మార్చుకున్నారని, లంచం లేకపోతే కన్వర్షన్ అనుమతులు ఆలస్యమవుతున్నాయని అనేక ఆరోపణలు వచ్చాయి. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ల్యాండ్ కన్వర్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం, అనుమతుల కోసం అడ్డంకులు ఎదురవడం అభివృ ద్ధికి ఆటంకమవుతోందంటున్నారు. ముఖ్యంగా, అనుమతుల మంజూరులో లంచాల ప్రభావం ఎక్కువగా ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు నాలా చట్టాన్ని రద్దు చేస్తామని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. త్వరలో క్యాబినెట్‌లో చర్చించి, ఆర్డినెన్స్ రూపంలో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. నాలా చట్టం రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి ఊపందుకుంటుందని, పారిశ్రామికవేత్తలకు సులభతరమైన అనుమతులు లభిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక, లైసెన్సులు, ఎన్‌వోసీల జారీ వేగవంతం చేయాలని యువ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పుంజుకొంటున్న రియల్ ఎస్టేట్
నన్నపనేని సీతారామరాజు, రియల్టర్, కంచికచర్ల
నాలా చట్టం రద్దుతో ల్యాండ్ కన్వర్షన్ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. భూమి విలువ ఎక్కువగా ఉండటంతో నాలా ఫీజు లక్షల్లో చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పుడు ఆ భారం ఉండదు. దీంతో వెంచర్లలో స్థలాల ధరలు కూడా తగ్గనున్నాయి. ఇప్పటి వరకు మందంగా నడుస్తున్న రియల్ ఎస్టేట్ రంగం ఇక బాగా పుంజుకోవటానికి అవకాశమేర్పడింది.
సింగిల్ విండో విధానం అమలు చేయాలి
సీహెచ్ నాగేశ్వరరావు, వీఎన్ అసోసియేట్స్, విజయవాడ
నాలా చట్టం రద్దుతో పాటు పారిశ్రామిక పురోగతికి ప్రత్యేకంగా సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలి. ఏపీఐఐసీ అధీనంలోని ప్లాట్లలో ఏదైనా కంపెనీ, ఫ్యాక్టరీ, సంస్థ ఏర్పాటు చేస్తే సింగిల్ విండో విధానం ద్వారా 21 ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు వస్తాయి. బయట కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఒక హద్దే ఉండదు.