KGBV: ఆహారం కలుషితమై..
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:06 AM
food contamination మందస వీజీపురంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం అర్ధరాత్రి సమయంలో కడుపునొప్పి, వికారంతో బాధపడ్డారు.

22 మంది విద్యార్థినులకు అస్వస్థత
హరిపురం సీహెచ్‌సీకి తరలింపు
మందస కేజీబీవీలో ఘటన
హరిపురం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మందస వీజీపురంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం అర్ధరాత్రి సమయంలో కడుపునొప్పి, వికారంతో బాధపడ్డారు. వెంటనే సిబ్బంది స్పందించి వీజీపురం సచివాలయ ఏఎన్‌ఎంను తెప్పించి వైద్యసేవలు అందించారు. గురువారం ఉదయానికి మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో మందస పీహెచ్‌సీ వైద్యులు మద్దిల సంపతిరావు పాఠశాలను సందర్శించి 22 మందికి వైద్యం అందించారు. వారిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 14 మందిని హరిపురం సీహెచ్‌సీకి తరలించారు. డి.శైలజ, వి.మౌనిక, ఎన్.ధార్మిత, పి.శంకుంతల, బి.జ్ఞానేశ్వరి, ఎస్.నవ్య, జి.జాహ్నావి, ఆర్.ఉజాల, డి.భవ్యశ్రీ, డి.లాస్య, కె.గోపిక తదితరులు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి డిప్యూటీ డీఎంహెచ్‌వో మారికలీజాన్ తన సిబ్బందితో సందర్శించి.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థినులంతా క్షేమంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్ యు.స్వరాజ్యలక్ష్మి తెలిపారు. అలాగే ఎంఈవో లక్ష్మణరావు, తహసీల్దార్ హైమావతి, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రత్యేకాధికారి ఆర్.వాసంతితో ఘటన వివరాలు తెలుసుకున్నారు. కాగా రాత్రివేళ బియ్యం సరిగా ఉడకకపోవడంతో విద్యార్థినులకు ఈ సమస్య వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాఠశాలలో పర్యవేక్షణ లేక ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు.
ఆహారంపై శ్రద్ధ తీసుకోవాలి
హరిపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మండల టీడీపీ నాయకులు పరామర్శించారు. విద్యార్థినులకు అందించే తాగునీరు, ఆహారంపై ఎస్‌ఎస్‌ఏ అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. మరోసారి ఇలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి తాతారావు, బైరిశెట్టి గున్నయ్య, పుల్లా వాసు, లబ్బ రుద్రయ్య, నవీన్ పాల్గొన్నారు.