Share News

Rims: రిమ్స్‌లో వసూళ్ల పర్వం

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:11 AM

RIMS fee collection ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతమంది అధికారులు వస్తున్నా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో సేవలు మాత్రం మెరుగుపడడం లేదు. సంవత్సరాలుగా అవే సమస్యలు, వైద్య సేవల్లో అదే తీరు అంటూ రోగులు ఆవేదన చెందుతున్నారు.

Rims: రిమ్స్‌లో వసూళ్ల పర్వం
రిమ్స్‌ ఆసుపత్రి

  • మగబిడ్డ పుడితే రూ.1200, ఆడబిడ్డ జన్మిస్తే రూ.వెయ్యి ఇవ్వాల్సిందే

  • సేవలు అంతంత మాత్రమే

  • అత్యవసర మందులకూ ఇబ్బందులే

  • అందుబాటులో లేని సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు

  • జూనియర్‌ డాక్టర్లే దిక్కు

  • వేధిస్తున్న నర్సింగ్‌ సిబ్బంది కొరత

  • జిల్లాకే పెద్దదిక్కుగా నిలిచిన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)లో వసూళ్ల పర్వం నడుస్తోంది. ప్రత్యేకంగా ప్రసూతి విభాగంలో రోగుల జేబులను వైద్య సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. మగబిడ్డ పుడితే రూ.1200, ఆడబిడ్డ జన్మిస్తే రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. రోగులను విశాఖ కేజీహెచ్‌కు అంబులెన్స్‌లో తీసుకెళ్లేందుకు రూ.2,600 తీసుకుంటున్నారు. పేరుకే పెద్దాసుపత్రి అయినా సేవలు మాత్రం ఆ స్థాయిలో అందడం లేదు. అడుగడుగునా సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఒకపక్క సిబ్బంది కొరత, మరోపక్క వృథాగా పడిఉన్న పరికరాలతో రోగులకు అరకొరగా సేవలు అందుతున్నాయి. అత్యవసర మందులు కూడా దొరకడం లేదు. స్టెరిలైజ్‌డ్‌ గ్లౌవ్స్‌ కూడా కొరతే. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

  • ................................

  • అరసవల్లి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతమంది అధికారులు వస్తున్నా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో సేవలు మాత్రం మెరుగుపడడం లేదు. సంవత్సరాలుగా అవే సమస్యలు, వైద్య సేవల్లో అదే తీరు అంటూ రోగులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, నాయకులు ఎవరూ చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ప్రత్యేకించి రిమ్స్‌ ప్రసూతి విభాగంలో వసూళ్ల దందా నడుస్తోందని రోగులు వాపోతున్నారు. గర్భిణులను లేబర్‌ రూమ్‌కి తీసుకువెళ్లాలన్నా, గాయాలు శుభ్రం చేయాలన్నా, కింది అంతస్థు నుంచి పై అంతస్థుకి తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మగబిడ్డ పుడితే రూ.1200, ఆడబిడ్డ అయితే రూ.1000 చొప్పున మ్యాటీ అసిస్టెంట్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రెస్సింగ్‌ చేసేందుకు రూ.300 చెల్లించాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు. హెడ్‌ నర్సులు వార్డుల్లో ఉండకుండా, రూమ్‌లో కూర్చుని కాలక్షేపం చేస్తుండడంతో ఈ వసూళ్లు నిరాటంకంగా సాగిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాత్రి 8 గంటలు దాటిన తరువాత అత్యవసర సేవలందించేందుకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీరు తమ రూముల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పీజీలు, జూనియర్‌ వైద్యులే చికిత్సలు అందిస్తున్నారు. ప్రత్యేకించి గుండె పోటు, రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలైన కేసుల్లో స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించాలి. కానీ, ఇటువంటి కేసులకు కూడా వారు హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రిలో 254 రెగ్యులర్‌ పోస్టులకు గాను కేవలం 124 మంది నర్సింగ్‌ సిబ్బందే పనిచేస్తున్నారు. అలాగే కాంట్రాక్టు పద్ధతిలో కూడా నర్సింగ్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎఫ్‌ఎన్‌వోలు కూడా కేవలం 23 మందే ఉన్నారు. దీంతో అంబులెన్సుల్లో ఆసుపత్రికి తీసుకువచ్చే రోగులను లోపలకు తీసుకువెళ్లేందుకు కూడా సిబ్బంది లేని దుస్థితి నెలకొంది. ఆసుపత్రికి సంబంధించి 120 మంది ఎంఎన్‌వోలు అవసరం కాగా కేవలం 26 మంది మాత్రమే ఉండడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

  • అంబులెన్సులు రెండే...

  • 850 పడకలు ఉన్న రిమ్స్‌లో కేవలం రెండు అంబులెన్స్‌లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వాస్తవానికి 5 అంబులెన్స్‌లు ఉన్నా ఇందులో రెండు పూర్తిగా పనిచేయడం లేదు. మరొకటి రిపేరులో ఉంది. జిల్లా నలుమూలల నుంచి రిఫరల్‌ కేసులను తీసుకురావడానికి ఈ రెండు అంబులెన్స్‌లు ఎలా సరిపోతాయో ఆ దేవుడికే తెలియాలి. అధికారులకు, నాయకులకు ఎన్ని విన్నపాలు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని వైద్యులు అంటున్నారు. అలాగే అత్యవసర రోగులను తీసుకువచ్చేందుకు గానీ లేదా రిఫరల్‌పై విశాఖపట్నం తీసుకువెళ్లేందుకు కానీ వెంటిలేటర్‌ అంబులెన్స్‌ ఒక్కటే ఉంది. కనీసం మరో ఒక్క వెంటిలేటర్‌ అంబులెన్స్‌ అయినా అందుబాటులో ఉంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. దీనిపై అధికారులు, నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే విశాఖ కేజీహెచ్‌కు కేసులను రిఫర్‌ చేస్తే, సంబంధిత రోగులు అంబులెన్స్‌కు రూ.2,600 అధికారికంగా చెల్లించాల్సిందే. ఈ మొత్తం తమకు ఎంతో భారం అవుతుందని రోగులు వాపోతున్నారు.

  • మందుల కొరత..

  • ఎమర్జెన్సీ వార్డుల్లో, క్యాజువాల్టీలో రోగులకు అత్యవసర చికిత్సలు అందజేస్తుంటారు. ఈ సమయంలో వీరికి ఇచ్చేందుకు సాధారణ పెంటాప్రజోల్‌, పారాసిటమాల్‌ ఇంజెక్షన్లు కూడా పరిమితంగా అందుబాటులో ఉండడంతో ఏం చేయాలో దిక్కు తోచక వైద్యులు సతమతమవుతున్నారు. అలాగే ఇన్‌ఫెక్షన్లలో వాడే యాంటీబయోటిక్‌ ఇంజక్షన్లకు కూడా తీవ్ర కొరత ఉందని అంటున్నారు. ఇక అత్యవసర సేవల్లో వినియోగించే డోపమైన్‌, డోబిటమిన్‌, ఎట్రోపిన్‌ వంటి ఇంజక్షన్ల సంగతి ఇక చెప్పనక్కరలేదు. సాధారణ సెలైన్లయిన ఎన్‌ఎస్‌, డీఎన్‌ఎస్‌, డి-5కు కూడా కొరత ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సల్లో పాల్గొనే వైద్యులకు స్టెరిలైజ్‌డ్‌ గ్లౌవ్స్‌ కూడా సరిపడినంతగా ఉండడం లేదు. గాయాలు, ఇన్‌ఫెక్షన్లలో కట్టు కట్టేందుకు, వాటిని శుభ్రం చేసేందుకు కూడా సాధారణ గ్లవ్స్‌ వాడాల్సి వస్తుంది. ఆపరేషన్‌ థియేటర్లలో ఏసీలు సరిగా పనిచేయకపోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే విధంగా కొవిడ్‌ సమయంలో ఆసుపత్రికి సరిపడినన్ని వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌ అనంతరం వాటిని ఉపయోగించకుండా అలాగే వదిలేశారు. దీంతో వాటిల్లో చాలా వరకు పనిచేయని పరిస్థితి నెలకొంది. అత్యవసర వార్డుల్లోని వెంటిలేటర్లు కూడా సరిగా పనిచేయడం లేదు. కొన్నింటిని రిపేరు చేయిస్తే పునర్వినియోగానికి ఉపయోగపడతాయని వైద్యులు అంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం ఎప్పుడో?

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా నేటికీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీని నియమించలేదు. దీనివల్ల ఆస్పత్రిలోని సమస్యలపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి, వాటిని పరిష్కరించేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికైనా జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు చొరవ చూపి నూతన అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

  • అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు

  • ప్రసూతి విభాగంలో అక్రమ వసూళ్లకు పాల్పడరాదని ఇప్పటికే సిబ్బందిని హెచ్చరించాం.. ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్షమించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. మందుల కొనుగోళ్లకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. 700 రకాల మందుల లోకల్‌ కొనుగోళ్లకు సంబంధించి అనుమతులు కూడా తీసుకున్నాం. మరికొద్ది రోజుల్లో మందుల విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు.

  • - డాక్టర్‌ షకీలా, రిమ్స్‌ అసుపత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Mar 28 , 2025 | 12:11 AM