బైక్ అదుపు తప్పి..
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:40 PM
కింతలిమిల్లు జంక్షన్‌లో ఆదివారం బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): కింతలిమిల్లు జంక్షన్‌లో ఆదివారం బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని జరజాం గ్రామానికి చెందిన బస హరిప్రసాద్ (21), ఎచ్చెర్ల గ్రామానికి చెందిన జలుమూ రు వేణు స్నేహితులు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యా హ్నం వీరి ద్దరూ కలిసి వేరొక స్నేహితుడి స్పోర్ట్స్ బైక్‌పై శ్రీకాకుళం నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. జాతీయ రహదారిపై కింతలి మిల్లు జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో హరిప్రసాద్ బైక్‌ను నడుపు తుండగా, వెనుక వేణు కూర్చొన్నాడు. కింతలి మిల్లు జంక్షన్‌కు వచ్చే సరికి ముందు వెళ్తున్న వ్యాన్, లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వేణు కాళ్లపై నుంచి వెళ్లగా.. హరిప్రసాద్‌ను లారీ బలంగా ఢీకొట్టడంతో తుళ్లి పోయి అదే రూట్‌లో వస్తున్న ఆర్టీసీ బస్సు కిందపడ్డాడు. అప్రమ త్తమైన డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి బస్సును నిలిపివేశాడు. ఈ ప్రమాదంలో హరిప్రసాద్ అక్కడి కక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వేణును 108 వాహనంలో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. హరిప్రసాద్ తల్లి రమణమ్మ శ్రీకాకుళంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తుంది. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.