Share News

cashew: మాడిన పూత, పిందె

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:53 PM

cashew Crop damage ఉద్దానంలో జీడి రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు ఆశించినస్థాయిలో వర్షాలు లేక ప్రతికూల వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జీడిపూతకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజులుగా పూత మాడిపోయి.. పిందెలు రాలిపోతున్నాయని వాపోతున్నారు.

cashew: మాడిన పూత, పిందె

  • జీడి పంటకు ప్రతికూల వాతావరణం

  • వెంటాడుతున్న తెగుళ్ల బెడద

  • దిగుబడి తగ్గనుందని రైతుల ఆందోళన

  • మందస మండలం గుడ్డిపద్రలో జీడిచెట్లకు రైతు లక్ష్మణరావు పురుగుల మందు పిచికారీ చేస్తున్న దృశ్యమిది(పైచిత్రం). ఇప్పటికే రెండు సార్లు మందులు చల్లగా.. ముచ్చటగా మూడోసారి కొడుతున్నారు. జీడిపూత నిలిచి పిందె దశలో టీదోమ నుంచి రక్షణ కోసం సస్య రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు మందు పిచికారీ చేసినా టీదోమ వదలడం లేదని వాపోతున్నారు. ఆ ప్రభావం దిగుబడిపై పడుతుందని దిగులు చెందుతున్నారు.

    ....................

  • హరిపురం/ కవిటి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో జీడి రైతులకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు ఆశించినస్థాయిలో వర్షాలు లేక ప్రతికూల వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జీడిపూతకు తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజులుగా పూత మాడిపోయి.. పిందెలు రాలిపోతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 30వేల హెక్టార్లలో జీడి సాగుచేస్తున్నారు. చాలామంది కొబ్బరి అంతరపంటగా జీడిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, మెళియాపుట్టి తదితర మండలాల్లో జీడిసాగు అధికం. ఇక్కడినుంచి వస్తున్న పిక్కలే ప్రధాన ముడిసరుకుగా సుమారు 480 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కాగా గత పదేళ్లుగా వరుస తుఫాన్‌లతో పాటు తెగుళ్ల కారణంగా జీడిపంటకు నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది కూడా వర్షాలు లేక ఎండ వేడిమి, మంచు ప్రభావంతో జీడిచెట్లు ఎండిపోతున్నాయి. అలాగే తెగుళ్ల కారణంగా పూతతోపాటు లేత పిందెలు కూడా మసిబొగ్గులా మారి రాలిపోతున్నాయి. తోటల్లో 20శాతం పూత కూడా పిక్కగా మారడం లేదు. జీడి పంట ప్రారంభ దశలోనే టీ దోమ తెగులు వ్యాపించడంతోపాటు తామర పురుగులు, బూడిద తెగులు, ప్రూట్‌ జాక్స్‌ అధికంగా ఏర్పడి పంటను సమూలంగా నాశనం చేస్తున్నాయి. పురుగుల మందు పిచికారీ చేస్తున్నా తెగుళ్ల బెడద వదలడం లేదని రైతులు వాపోతున్నారు.

  • దిగుబడిపై ప్రభావం..

  • ఏటా తుఫాన్‌లు, ప్రతికూల వాతారణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా జీడి దిగుబడి తగ్గుతోంది. ఈ ఏడాది ఎకరాకు ఐదు నుంచి పది బస్తాలు దిగుబడి వస్తుందని మొదట్లో అధికారులు అంచనా వేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఎకరాకు నాలుగు బస్తాల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీని ప్రభావం జిల్లాలోని జీడి పరిశ్రమలపై పడనుంది. ముడిసరుకులేక పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాపారులకు విదేశాల నుంచి దిగుమతి చేసే పిక్కలే దిక్కులా మారాయి. కాగా, దిగుమతి పిక్కలపై జీడి సుంకం పెంచడంతో అవీ గిట్టుబాటుకాక, స్థానికంగా ముడిసరకు దొరక్క పరిశ్రమలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

  • బీమా అందజేయాలి

    జీడి రైతులకు ప్రభుత్వమే మందులు సరఫరా చేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో మందులు కల్తీ అవుతున్నాయి. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గి, ధరలు కుదేలై రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి, జీడి పంటకు బీమా అందించాలి.

    - బైరిశెట్టి గున్నయ్య, జీడి రైతు, హరిపురం

    ..................

  • సూచించిన మందులే వాడాలి

    జీడిపంటలో టీ దోమ, తామరపురుగు, పిండితెగులు, ప్రూట్‌జాక్‌ నుంచి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే కార్యాలయానికి సంప్రదించాలి.. పంటను పరిశీలించి.. తెగుళ్ల నివారణ మందులు సిఫారసు చేస్తాం. బీమా కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం.

    - శంకర్‌ దాస్‌, ఉద్యానవన శాఖాధికారి, మందస

    ..................

  • గాలులు లేకపోవడమే

    జీడి పూత దశలో గాలులు లేకపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. మంచు ప్రభావంతో జీడిపూత మాడి రాలిపోతోంది. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గే ప్రమాదం ఉంది.

    - జల్లు యుగంధర్‌, రైతు, జల్లుపుట్టుగ, కవిటి

    ..................

  • ఆశలు వదులుకోవాల్సిందే

    ఈ ఏడాది జీడిపంట దిగుబడి మెరుగ్గా ఉంటుందని ఆశించాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పూత మాడిపోయి కనిపిస్తోంది. ఇలాగే ఉంటే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రైతులు ఈ ఏడాది జీడిపై ఆశలు వదులుకోవాల్సిందే.

    - గార గిరిబాబు, రైతు, కవిటి

Updated Date - Apr 02 , 2025 | 11:55 PM