Share News

పూర్ణామార్కెట్‌ ప్రాంతం ప్రక్షాళన

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:16 AM

రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో ఉక్కిరిబిక్కిరిగా ఉండే పూర్ణామార్కెట్‌ ప్రాంతం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది.

పూర్ణామార్కెట్‌ ప్రాంతం ప్రక్షాళన

  • పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

  • ఏళ్లతరబడి పాతుకుపోయిన వారిని సైతం ఖాళీ చేయించిన పోలీసులు

  • స్థానికులు, వాహనచోదకులు హర్షం

మహారాణిపేట, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):

రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో ఉక్కిరిబిక్కిరిగా ఉండే పూర్ణామార్కెట్‌ ప్రాంతం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం పోలీసులు పెద్దసంఖ్యలో రంగంలోకి దిగి ప్రధాన రహదారులపై ఉండే ఆక్రమణదారులను ఖాళీ చేయించారు. వన్‌టౌన్‌ సీఐ జి.దేముడుబాబు ఆధ్వర్యంలో బృందాలు మైకులో హెచ్చరికలు చేస్తూ పూర్ణామార్కెట్‌ మెయిన్‌రోడ్డు, చుట్టుపక్కల రహదారులపై ఆక్రమణదారులను ఖాళీ చేయించారు. మూడు దశాబ్దాల కిందట ఆక్రమించినవారిని సైతం వెళ్లగొట్టారు. వాహనాలు సాఫీగా వెళ్లకుండా రహదారులను ఆక్రమించేశారని, అడిగిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని పోలీస్‌ అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై నెల కిందట పోలీస్‌ కమిషనర్‌ చొరవ తీసుకుని ఆక్రమణలు తొలగింపజేశారు. అయితే ఇటీవల ఓ చోటా నేత ఆధ్వర్యంలో మళ్లీ యథావిధిగా ఆక్రమణలు వెలిశాయి. ఈ విషయం తెలిసి పోలీస్‌ కమిషనర్‌ గురువారం రాత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను సిబ్బంది పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ‘పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు బేఖాతరు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసు కమిషనర్‌ బాగ్చి స్పందించి...ఆక్రమణలు తొలగించాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులు శుక్రవారం సాయంత్రం పెద్దఎత్తున పూర్ణామార్కెట్‌ ప్రాంతానికి చేరుకుని ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారిని సైతం వెళ్లగొట్టారు. స్ర్పింగ్‌ రోడ్డు, ప్రూట్‌ మార్కెట్‌ రోడ్డు, పూర్ణామార్కెట్‌ ప్రధాన రహదారులను ఖాళీ చేయించారు. పూర్ణామార్కెట్‌ ప్రాంతంలో వాహనాలు సాఫీగా వెళ్లేలా చేశారు. పోలీసుల చొరవ కారణంగా పూర్ణామార్కెట్‌ ప్రక్షాళన జరిగిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 01:16 AM