సూర్యప్రతాపం
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:04 AM
నుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజు రోజుకీ సూర్య ప్రతాపం అధికమవుతుండటంతో ప్రజలు పది దాటితే ఇంటికే పరిమితమవుతున్నారు.

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
ఆర్టీసీ, పర్యాటక శాఖలకు ఎండదెబ్బ
తగ్గిన బెలుం గుహల ఆదాయం
కొలిమిగుండ్ల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజు రోజుకీ సూర్య ప్రతాపం అధికమవుతుండటంతో ప్రజలు పది దాటితే ఇంటికే పరిమితమవుతున్నారు. మరోవైపు ఎండల దెబ్బకు జన సంచారం తగ్గిపోవడంతో ఆర్టీసీ, పర్యాటక శాఖల ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు బెంబెలెత్తారు. దీంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం అయితే చాలు ప్రధాన రహదారులు, వీధులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులు ఎండల ధాటికి హడలిపోతున్నారు.
బెలుంగుహలకు తగ్గిన ఆదాయం
ఎండలు, ఉక్కపోత కారణంగా ప్రముఖ పర్యాటక కేంద్రం, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద పొడవైన గుహలుగా పేరుగాంచిన బెలుం గుహలు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్రంగా మారిన ఎండ దెబ్బ టూరిజం శాఖ ఆదాయానికి గండి కొడుతోంది. ఓవైపు ఎండలు, మరోవైపు విద్యార్థుల పది పరీక్షల కారణంగా బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే ఎండలు భారీగా పెరిగాయి. రెండు రోజులుగా నంద్యాల జిల్లాతో పాటు, కొలిమిగుండ్ల మండలంలో 42డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు కొలిమిగుండ్ల మండలం మైనింగ్ ప్రాంతం కావడంతో భూమిలో వేడి మరింత అధికంగా ఉంటోంది. దీంతో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఉష్ణోగ్రత్తలు కాస్త అధికంగానే నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో పర్యాటకుల తాకిడి తగ్గి బెలుం గుహలకు ఆదాయం తగ్గినట్లు పర్యాటక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో రోజూ రూ.30 నుండి రూ.50, లక్ష రూపాయలవరకు ఆదాయం సమకూరేవి. కానీ వేసవి కారణంగా బెలుం గుహలకు ప్రస్తుతం రోజుకు రూ.10వేలకు మించడం ఆదాయం రావడం లేదు. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం మరింతగా తగ్గే ప్రమాదం ఉంది.