చేతికొచ్చిన పంట చేజారిపోయే
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:43 PM
చేతికొచ్చిన పంట చేజారిపోయింది. వడగండ్లు, అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది.

వడగండ్లు, అకాల వర్షంతో భారీగా పంట నష్టం
వంద ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న
260 ఎకరాల్లో వరి.. 1419 ఎకరాల్లో మిరప..
నంద్యాల ఎడ్యుకేషన, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): చేతికొచ్చిన పంట చేజారిపోయింది. వడగండ్లు, అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. జిల్లాలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ప్రధానంగా వరి, మామిడి, మిరప రైతులకు తీరని నష్టం వాటిల్లింది. వ్యవసాయాధికారులు ముందుగా ప్రాథమిక అంచానలు వేసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ సహాయకులతో గ్రామాల వారీగా పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు.
ఫ భారీగా నష్టపోయిన మిరప రైతులు
జిల్లాలో కోవెలకుంట్ల, గోస్పాడు, దొర్నిపాడు మండలాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామ పరిధిలో 208 ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువగా పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే 82 మంది రైతులు 277 ఎకరాల్లో 33 శాతం కంటే తక్కువగా పంట నష్టపోయినట్లు లెక్క వేశారు. అలాగే గోస్పాడు మండలం ఓంటివెలగల గ్రామ పరిధిలోని 23 మంది రైతులు 65 ఎకరాల్లో (33శాతం కంటే ఎక్కువ), 82 మంది రైతులు 381 ఎకరాల్లో (33 శాతం తక్కువ) పంటనష్టం వాటిల్లింది. దొర్నిపాడు మండలం 35 మంది రైతులు 109 ఎకరాల్లో (33 శాతంకంటే ఎక్కువ), 82 మంది రైతులు 381 (33 శాతంకంటే తక్కువ) నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 1419 ఎకరాల్లో మిరప పంట నష్టం వాటిల్లగా సుమారు రూ.60 నుంచి రూ.70 లక్షల మేర పంట నష్టం వాటిల్లింది.
ఫ మొక్కజొన్న రైతుకు నష్టం
కోవెలకుంట్ల, దొర్నిపాడు మండలాల్లో పాల దశలో ఉన్న మొక్కజొన్న పంటను వడగండ్ల వాన దెబ్బతీసింది. కోవెలకుంట్ల మండలం 57 ఎకరాలు, దొర్నిపాడు మండలంలో 45 ఎకరాల్లోనూ పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.
ఫ వరి పంటకు తీరని నష్టం
గోస్పాడు మండలంలో పొట్ట దశలో ఉన్న వరి అకాల వర్షానికి నేలకూలింది. మండలంలో 32 మంది రైతులకు చెందిన 260 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. కాని ప్రాథమిక అంచనాలకంటే అధికంగానే వరి పంట నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో నష్ట పరిహారాన్ని సేకరించే వ్యవసాయ సిబ్బంది పంట నీటిలో మునిగిందా.. ఎంత శాతం మేర నీటిలో మునిగింది అన్నది చూసి లెక్క కడతారు. కాని వడగండ్లకు పంట నేలరాలినది.. పైరు కూలినది.. గింజలు నేలపై రాలినవి వారి లెక్కల్లోకి రాకపోవడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఫ జిల్లాలో ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు
-----------------------------------
మండలం - ఎంఎం
-----------------------------------
గోస్పాడు - 19.0
కోవెలకుంట్ల - 18.2
బనగానపల్లె - 13.2
ఆళ్లగడ్డ - 10.4
ప్యాపిలి - 10.4
ఉయ్యాలవాడ - 9.2
శిరువెళ్ల - 7.6
డోన - 5.8
---------------------------------------