Time Bank of India: సేవకు సరైన ‘సమయం’!
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:48 AM
మీకు అవసరమైనప్పుడు అంతే సమయాన్ని మీకోసం కేటాయిస్తారు! ఇది... ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సరికొత్త ‘డిపాజిట్ స్కీమ్’! వృద్ధుల కోసం వినూత్న సేవలందించే టైం బ్యాంక్ ఇండియా కార్యక్రమాలు త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సేవలు
ఇప్పుడు వృద్ధుల సేవ కోసం సమయం కేటాయించి భవిష్యత్తులో తామూ సేవలు పొందవచ్చు
సభ్యులు చేసే సేవల సమయం ఖాతాలో జమ.. అవసరమైనపుడు ఆ సమయాన్ని వాడుకునే వీలు
ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్న సంస్థ
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, ఇతర నిస్సహాయులకు సేవ చేయండి! సేవ చేసిన ‘సమయా న్ని’ మీ ఖాతాలో దాచుకోండి. మీకు అవసరమైనప్పుడు అంతే సమయాన్ని మీకోసం కేటాయిస్తారు! ఇది... ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సరికొత్త ‘డిపాజిట్ స్కీమ్’! వృద్ధుల కోసం వినూత్న సేవలందించే టైం బ్యాంక్ ఇండియా కార్యక్రమాలు త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ఈ సంస్థ తరఫున రాజస్థాన్‌కు చెందిన పీసీ జైౖన్ బృం దం ప్రభుత్వ అధికారులతో శుక్రవారం భేటీ అయింది. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సేవలు అందిస్తామని చెప్పారు. వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టి వారికి సామాజిక అండ లభించాలన్న దే సీఎం ఆలోచన అని అధికారులు తెలిపారు. ‘టైమ్ బ్యాంక్’ సేవల ను దేశంలోనే మొట్టమొదటిసారి 2019లో సిక్కింలో అమలు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోను ఉచితంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థ మన రాష్ట్రంలోను తమ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే విశాఖను పైలట్ జిల్లాగా తీసుకుని టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సేవలు ప్రారంభించింది. అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చిన తర్వాత మరింత ముందుకు వెళ్లేందుకు ప్రణాళికను రచిస్తున్నారు.
పెరుగుతున్న ఒంటరి వృద్ధులు..: గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వలన వృద్ధులకు ఒంటరితనం ఉండేది కాదు. కానీ కాలక్రమేణా వారు ఒంటరిగా మారుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 10.38 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 2047 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కాబట్టి భవిష్యత్‌లో రాష్ట్రంలోని వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందు కు టైమ్ బ్యాంక్ అండగా నిలుస్తుంది. తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007, దత్తత, పోషణ చట్టం-1956 ప్రకారం వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నప్పుడే హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఏపీ సాధ్యమౌతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
టైం బ్యాంక్ పనిచేస్తుంది ఇలా..
టైం బ్యాంక్ ఆర్థిక లాభాపేక్షలేని సామాజిక వ్యవస్థ. వృద్ధులకు, ఒంటరిగా జీవించేవారికి సహాయం చేయడం కోసం దీనిని ప్రారంభించారు. ఈ బ్యాంకు సహాయం కావాలంటే ముందుగా సభ్యులుగా చేరాలి. దీనిలో సభ్యులు తమ సమయాన్ని డబ్బుకు బదులుగా సేవల కోసం ఉపయోగించుకుంటారు. బ్యాంకు సభ్యులైనవారు మరొక సభ్యుడైన ఒంటరివ్యక్తికి ఇంటిపనుల్లో సాయం, తోడుగా ఉండటం తదితర సహాయ పనులు చేసి ఆ సమయాన్ని తన ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు. సదరు సహాయం చేసిన వ్యక్తి తన అవసరంలో తన ఖాతాలో ఉన్న డిపాజిట్ సమయం మేరకు మరొక వ్యక్తి నుంచి సహాయం పొందవచ్చు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే