Share News

తల్లి చావు కోసం కొడుకుల నిరీక్షణ

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:08 PM

నారాయణి చిన్న కుమారుడైన భాస్కర్‌ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక ముస్లిం యువతిని పెళ్ళి చేసుకుని... ఊళ్ళో ఉండడం ఇష్టం లేక లండన్‌ వెళ్ళిపోతాడు. భార్యా భర్తలిద్దరూ అక్కడ ఉద్యోగం చేస్తుంటారు.

తల్లి చావు కోసం కొడుకుల నిరీక్షణ

అన్ని నిరీక్షణల్లోకి మృత్యువుకోసం నిరీక్షించడం దుర్భరంగా ఉంటుంది. అందులోనూ ఒక మనిషి ఇవాళో రేపో చనిపోతాడని డాక్టర్లు నిర్ధారించి, దానికి మానసికంగా అందరూ సిద్ధమై ఎదురు చూస్తున్నప్పుడు ఆ మృత్యువు ఇంకా ఇంకా దూరం జరుగుతుంటే... ఆ నిరీక్షణ మరింత దుర్భరంగా ఉంటుంది. ఆఖరి గడియల్లో ఉన్న కన్నతల్లి కన్నుమూసే క్షణం కోసం ఆమె కుమారుల ఎడతెగని నిరీక్షణే ‘నారాయణీంటే మూన్నాన్మక్కల్‌’. దాని అర్థం ‘నారాయణి ముగ్గురు కుమారులు’ అని. మృత్యువు ముంగిట్లో ఉన్న నారాయణి ముగ్గురు కుమారులైన విశ్వనాథన్‌, సేతు, భాస్కర్‌ల జీవిత కథే ఈ చిత్రం.


నారాయణి చిన్న కుమారుడైన భాస్కర్‌ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక ముస్లిం యువతిని పెళ్ళి చేసుకుని... ఊళ్ళో ఉండడం ఇష్టం లేక లండన్‌ వెళ్ళిపోతాడు. భార్యా భర్తలిద్దరూ అక్కడ ఉద్యోగం చేస్తుంటారు. తల్లి చివరి గడియల్లో ఉందన్న కారణంగా భార్యా పిల్లలతో ఇరవై సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. పెద్ద కొడుకు విశ్వనాథన్‌కు ఒక కూతురు. రెండో కొడుకైన సేతు వివాహం కాలేదన్న కారణంగా తల్లితో కలిసి ఉంటూ అదే ఊళ్ళో దుకాణం నడుపుతుంటాడు.


book8.2.jpg

భాస్కర్‌ ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం కారణంగా తండ్రి గుండెపోటుతో మరణించాడని విశ్వనాథన్‌ తమ్ముడిపై కోపంగా ఉంటాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తినప్పుడల్లా సేతు మధ్యలో అడ్డుపడి పరిస్థితిని చక్కదిద్దుతుంటాడు. ఒకే వయసు వారైన విశ్వనాథన్‌ కూతురు అతిర, భాస్కర్‌ కొడుకు నిఖిల్‌ ేస్నహంగా ఉంటారు. భాస్కర్‌ లండన్‌కు వెళ్ళాల్సిన సమయం సమీపిస్తుంటుంది. విశ్వనాథన్‌ కూడా సెలవు పొడిగించవలసి వస్తుంది. ఆ ఎడతెగని నిరీక్షణలో ఇద్దరూ ఒక దశలో తల్లిని చంపడానికి కూడా ప్రయత్నించి ఆ పని చేయలేక ఆగిపోతారు. తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కారణంగా భాస్కర్‌కు ఆస్తిలో వాటా ఇవ్వడానికి విశ్వనాథన్‌ ఇష్టపడకపోవడంతో ఇద్దరూ ఘర్షణ పడతారు.


సేతు ఇద్దరికి సర్దిచెప్పి తన వాటా భాస్కర్‌కు ఇచ్చేస్తానని చెబుతాడు. భాస్కర్‌ దానికి ఇష్టపడకుండా ఆస్తిలో తనకు చట్టబద్ధంగా వచ్చే వాటా కావాలని అంటాడు. చివరకు ముగ్గురు అన్న దమ్ముల మధ్య సయోధ్య ఏర్పడి భాస్కర్‌ భార్య లండన్‌ వెళ్ళిపోయేలాగా, భాస్కర్‌, అతని కొడుకు మరికొంత కాలం ఊళ్ళో ఉండి పోయేలాగా నిర్ణయిస్తారు. ఆస్థి కోసం గొడవ పెట్టుకున్నందుకు భాస్కర్‌, విశ్వనాథన్‌ ఇద్దరూ పశ్చాత్తాపపడడంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీలుస్తారు. అంతా సవ్యంగా ఉందనుకున్న ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన మళ్లీ అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఆ సంఘటన ఏమిటి? దాని పర్యవసానాలు ఏమిటి అనేదే మిగిలిన కథ.


book8.3.jpg

మలయాళం సినిమాలు సహజసిద్ధమైన కుటుంబ కథాచిత్రాలకు, విభిన్న కథాచిత్రాలకు పెట్టింది పేరు. చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని దాని చుట్టూ అద్భుతంగా కథ అల్లి ఇలాంటి కథాంశంతో కూడా సినిమా తీయొచ్చా అనిపించేలాంటి సినిమాలు మలయాళంలో కోకొల్లలు. ‘కుంబలంగి నైట్స్‌’, ‘తొట్టప్పన్‌’ మొదలుకుని నిన్న మొన్నటి ‘ఉల్లోజుహుక్కు’, ‘భరతనాట్యం’ వరకూ అన్నీ అలాంటి విభిన్న కథా చిత్రాలే. మర్డర్‌ మిస్టరీలు, సస్పెన్స్‌ థ్రిల్లర్ల మాయాజాలంలో పడిపోయి మలయాళం సినిమా దారితప్పుతుందేమోనని భయపడే తరుణంలో వచ్చిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘నారాయణీంటే మూన్నాన్మక్కల్‌’.


దర్శకుడు శరణ్‌ వేణుగోపాల్‌కు ఇది మొదటి సినిమా అయినా ఆ ఛాయలు ఎక్కడా కనపడకుండా అనుభవజ్ఞుడిలా సినిమా ఆద్యంతం చక్కటి భావోద్వేగాలతో ఆసక్తికరంగా నడిపించాడు. అన్నదమ్ములుగా జోజు జార్జి, సూరజ్‌ వింజరమూడు, అలెన్సియర్‌ లెలోపెజ్‌ లాంటి చక్కటి ప్రతిభావంతులైన నటుల్ని ఎన్నుకోవడం కూడా దర్శకుడికి మరింతగా కలిసి వచ్చిన విషయం. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని, అసూయ ద్వేషాల్ని, బలమైన భావోద్వేగాలను చూస్తున్నప్పుడు అది సినిమాలా కాకుండా జీవితాన్ని దాని ట్రూ కలర్స్‌లో చూస్తున్న భావన కలుగుతుంది. జోజు జార్జి, సూరజ్‌ వింజరమాడు, అలెన్సియర్‌లు నిజంగా ఒక ఇంటిలోని అన్నదమ్ముల్లా సహజంగా నటించారు. సరిగ్గా తెలివి తేటలు లేని కారణంగా చదువు ఆగిపోయి దుకాణం నడుపుకొనే సేతు పాత్రలో జోజు జార్జి చిరకాలం గుర్తుండిపోతాడు.


సేతు దుకాణానికి వచ్చిన కుర్రాడు‘బ్రాహ్మిన్‌ కర్రీ పౌడర్‌ ఉందా’ అని అడిగితే ‘‘సెక్యులర్‌ కర్రీ పౌడర్‌ ఉంది’’ అని ేసతు చెప్పడం, జీవితంలో ఏ సంబంధాలైనా శాశ్వతంగా ఉండిపోవని, మార్పులకు లోనవుతాయని, స్నేహితులు శత్రువులుగా, శత్రువులు స్నేహితులుగా మారవచ్చని అనడం లాంటి వ్యాఖ్యానాలు మధ్య మధ్యలో మెరుపుల్లా వచ్చి పోతుంటాయి. అతిర, నిఖిల్‌ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యాన్ని చివరికి హుందాగా ముగిం చడంలో కూడా దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.

సహజసిద్ధమైన చక్కటి లొకేషన్లను అంతే అందంగా చిత్రీకరించినందుకు ఫొటోగ్రఫీని ప్రత్యేకంగా అభినందించాలి. మొత్తం మీద ‘నారాయణి ఆమె ముగ్గురు కుమారులు’ భిన్న భావోద్వేగాలకు ప్రతిరూపాలు.

- జి.లక్ష్మి, 94907 35322

నారాయణీంటే మూన్నాన్మక్కల్‌ (మలయాళం)

నటీనటులు: జోజు జార్జి, సూరజ్‌ వింజరమూడు, అలెన్సియర్‌,

లె లోపెజ్‌, గార్గి అనంతన్‌ తదితరులు.

దర్శకుడు: శరణ్‌ వేణుగోపాల్‌

నిడివి: 117 నిమిషాలు

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Updated Date - Mar 23 , 2025 | 12:08 PM