Share News

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:39 PM

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి.

శ్రీశైలంలో నేటి నుంచి  ఉగాది మహోత్సవాలు

నేడుస్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ

అమ్మవారికి మహలక్ష్మీ అలంకారం

శ్రీశైలం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ ఉగాది మహోత్సవాలు ఈ నెల 31న ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. 29న ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు, 30వ తేదీ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, రథోత్సవం నిర్వహిస్తారు. గురువారం ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో శివసంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, చండీశ్వరపూజ, తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు జరుగుతాయి.

ఫ కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీగిరి క్షేత్రం కన్నడిగులతో కిక్కిరిసింది. తమ ఆడపడుచైన భ్రమరాంబ అమ్మవారికి చీరసారెను సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ పాదయాత్రికులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో బుధవారం శ్రీశైల క్షేత్రవీధులన్ని రద్దీగా దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి క్యూలైన్లలో కన్నడ భక్తులు బారులుతీరారు. ఉత్సవాలో భక్తుల తాకిడి దృష్ట్యా నేటి నుంచి గర్భాలయంలో అర్జితసేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేసి అలంకరణ దర్శనంమాత్రమే కల్పిస్తున్నారు. దీంతో వచ్చే భక్తులు మూడు క్యూలైన్ల ద్వారా అలంకారణ దర్శనమే చేసుకోవడం వల్ల దర్శనాలు వేగంగా కొనసాగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు దేవస్థానం సిబ్బంది, శివసేవకులు నిరంతరం తాగునీరు, అల్పహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా లడ్డూ కౌంటర్ల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడిగినన్ని లడ్డూలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం, వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ చోట్ల వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు.

Updated Date - Mar 26 , 2025 | 11:39 PM