Political Scene : రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు !
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:33 AM
వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు, అక్రమాస్తుల కేసులో ఏ2, 16నెలలు జగన్‌కు జైలులో సహచరుడు, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల...

నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
ఇక ఏ రాజకీయ పార్టీలోనూ చేరను
వ్యవసాయమే నా భవిష్యత్తు
టీడీపీతో రాజకీయ విభేదాలే..
చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు
జగన్, భారతి, మోదీ, షాకు కృతజ్ఞతలు
‘ఎక్స్’ వేదికగా సంచలన ప్రకటన
10న విదేశాలకు...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు, అక్రమాస్తుల కేసులో ఏ2, 16నెలలు జగన్‌కు జైలులో సహచరుడు, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ‘ఇక ఏ పార్టీలోనూ చేరను. వ్యవసాయమే నా భవిష్యత్తు’ అని ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ... శనివారమే దానికి రాజీనామా చేస్తున్నట్లు సాయి రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘రాజకీయాల నుంచి తప్పుకొంటున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు’’ అని ఆయన తెలిపారు.
కలకలం... సంచలనం!
ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పరాజయ భారం నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు! ఇలాంటి పరిస్థితుల్లో... వైఎస్ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా నమ్మినబంటులా ఉన్న విజయ సాయిరెడ్డి చేసిన ‘రాజీనామా’ ప్రకటన వైసీపీలో పెను సంచలనం సృష్టిస్తోంది. అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు అనంతరం జగన్‌కు సాయిరెడ్డి మరింత సన్నిహితుడయ్యారు. వైసీపీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ వచ్చారు. 2009 నుంచి 2019 దాకా పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండగా... తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరించారు. మరీముఖ్యంగా... 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేశ్‌లపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే.. తన స్థాయికి, హుందాకు తగని వ్యాఖ్యలు చేస్తూ ‘వివాదాస్పదుడి’గా ముద్ర వేయించుకున్నారు.
అక్రమాస్తుల కేసులో ఏ2గానే కాదు... వైసీపీలోనూ సుదీర్ఘకాలం నంబర్ 2గా సాయిరెడ్డి కొనసాగారు. పార్టీలో సజ్జల రామకృష్ణా రెడ్డి క్రియాశీలం అయ్యాక సాయిరెడ్డి పరిస్థితి మారిపోయింది. ఆయనను జగన్ కొన్నాళ్లు దూరం ఉంచడం, కొన్నాళ్లు బుజ్జగించడం... ఇలా వైసీపీలో సాయిరెడ్డి పరిస్థితి గజిబిజిగా తయారైంది. ఒక దశలో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా చక్రం తిప్పారు. ఆ తర్వాత సాయిరెడ్డిని తప్పించి... జగన్ తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. జగన్‌పై తాను అలిగినా, తనపై జగన్ ఆగ్రహించినా సాయిరెడ్డి మాత్రం ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు.
బాబు, బాలయ్యతో మాట్లాడారని...
నారా లోకేశ్ పాదయాత్రను ప్రారంభించే సమయంలో నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన భార్య సాయిరెడ్డికి సన్నిహిత బంధువు. దీంతో... తారకరత్నకు వైద్య సేవలు అందించే సమయంలో సాయిరెడ్డి తరచూ ఆస్పత్రికి వచ్చి వెళ్లారు. అదే సమయంలో... బాలకృష్ణ, చంద్రబాబుతో పలుమార్లు మాట్లాడారు. ఇది .. జగన్‌కు ఆగ్రహం తెప్పించిందని అంటారు. ఆ తర్వాత కా లంలో మళ్లీ దగ్గరైనా అంతకుముందున్న ‘పరస్పర విశ్వాసం’ సన్నిగిల్లిందని చెబుతారు. వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకాల వివాదంలో ఆయన జగన్ పక్షానే నిలిచారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిలపై విమర్శలు గుప్పించి... వారికీ చెడ్డయ్యారు.
‘పోర్టు’ వివాదంలో మునిగి...
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జగన్‌తోపాటు సాయిరెడ్డిపై కేసుల కత్తి వేలాడుతూనే ఉంది. దీనికి తోడు... తాజాగా కాకినాడ డీప్‌సీ పోర్టు వివాదంలో సాయిరెడ్డి నిండా మునిగిపోయారు. బెదిరించి, భయపెట్టి పోర్టులో వాటాలు లాక్కున్నారన్న ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో సాయిరెడ్డి కూడా నిందితుడే. దీనిని ఆధారంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. సాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది కూడా! అదే సమయంలో అనూహ్యంగా సండూర్ పవర్‌లో పెట్టుబడులపైనా ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో... కాకినాడ డీప్‌పోర్టులో వాటాలను ‘అరబిందో’ వదిలేసుకుంది. అయినా... కేసు మాత్రం అలాగే ఉంది! వీటన్నింటి నేపథ్యంలోనే సాయిరెడ్డి ‘రాజీనామా’ ప్రకటన వెలువడటం గమనార్హం.
ఫిబ్రవరి 10న విదేశాలకు...
రాజీనామా చేసిన ప్రకటన రోజునే... విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ సాయిరెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ వరకు నార్వే, ఫ్రాన్స్‌లో పర్యటించేందుకు అనుమతించాలని పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం సీబీఐ స్పందన కోరుతూ విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.
‘అయోధ్య’దీ అదే దారి!?
వైసీపీకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా త్వరలోనే వైసీపీకి గుడ్‌బై చెప్పి... తన పదవికి రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత కోసం ఆయన వేచి చూస్తున్నారని... అది రాగానే రాజీనామా ప్రకటన చేస్తారని చెబుతున్నారు.
ఇదీ సాయిరెడ్డి ప్రకటన
‘‘రాజకీయాల నుంచి తప్పుకొంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీ (శనివారం) రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మగారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా... పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో, శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోం మంత్రి అమిత్‌షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించాను. చంద్రబాబుగారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కల్యాణ్‌గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.’’
మరిన్ని తెలుగు వార్తలు కోసం..
Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..
Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు
Also Read: కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?
For AndhraPradesh News And Telugu News