100 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:57 AM
ఆటోలో తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రౌడీషీటర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

- రౌడీషీటరుతో పాటు ఇద్దరి అరెస్టు
- పరారీలో ఆటో డ్రైవర్, మరో రౌడీ షీటరు
నర్సీపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆటోలో తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రౌడీషీటర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి రవాణాపై ముందుగా అందిన సమాచారంతో ట్రైనీ డీఎస్పీ ఎంవీకే చైతన్య, ఎస్‌ఐ రమేశ్, ఏఎస్‌ఐ సాంబ.. పెదబొడ్డేపల్లి ఏపీ బాలుర గురుకుల పాఠశాల సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టారన్నారు. తాళ్లపాలెం వైపు వెళుతున్న ఆటోలోని ఇద్దరు పోలీసులను చూపి పరారయ్యారని తెలిపారు. ఆటో సీటు వెనక తనిఖీ చేయగా నాలుగు బస్తాలతో వంద కిలోల గంజాయి లభ్యమైందని తెలిపారు. నర్సీపట్నానికి చెందిన రౌడీషీటరు గుడాల పార్థకీర్తి (27), చింతపల్లి మండలం తాజంగి కొరుకొండకి చెందిన మజ్జి గాంఽధీ (24), వంటల హరిబాబు (20)లను అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. జీకేవీధి మండలం జెర్రిల పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారని డీఎస్పీ చెప్పారు. కొనుగోలు చేసిన వంద కిలోల గంజాయిని రెండేసి కిలోలు చొప్పున 50 ప్యాకెట్లుగా తయారు చేసి నాలుగు బస్తాల్లో ఆటోలో తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డారని తెలిపారు. వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, మూడు సెల్ ఫోన్లు, ఆటోని సీజ్ చేశామని తెలిపారు. పరారైన ఇద్దరులో ఆటో డ్రైవర్, నర్సీపట్నానికి చెందిన మరో రౌడీ షీటరు ఉన్నారన్నారు. నిందితులు గంజాయి వ్యాపారంలో ఆస్తులు సంపాదించినట్టు విచారణలో నిర్థారణ అయితే వారి ఆస్తులు జప్తు చేస్తామని అన్నారు. పట్టణ సీఐ గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.