Share News

7న అరకులోయలో 108 సూర్య నమస్కారాలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:17 AM

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్‌ 7వ తేదీన అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో 20 వేల మంది బాలబాలికలతో 108 సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయనున్నట్టు చెప్పారు.

7న అరకులోయలో 108 సూర్య నమస్కారాలు
అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో యోగాసనాల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌.

20 వేల మంది బాలబాలికలతో 108 నిమిషాల్లో నిర్వహణ

గిన్నిస్‌ రికార్డే లక్ష్యం

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు

అరకులోయ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్‌ 7వ తేదీన అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో 20 వేల మంది బాలబాలికలతో 108 సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేయనున్నట్టు చెప్పారు. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పడమే లక్ష్యమన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఇప్పటికే బాలబాలికలకు సూర్యనమస్కారాలపై ప్రత్యేక తర్ఫీదు ఇచ్చినట్టు చెప్పారు. విద్యార్థులలో చైతన్యం, మానసిక, శారీరక వికాసానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. చలి ఉత్సవాల నిర్వహణతో అరకులోయకు పర్యాటకుల సంఖ్య పెరిగిందని, ఈ కార్యక్రమం పర్యాటకుల పెంపునకు మరింతగా దోహదపడుతుందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి నియంత్రించే చర్యల్లో భాగంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు పరిశీలన

అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో సూర్యనమస్కారాల ఏర్పాట్లను జేసీ అభిషేక్‌గౌడ్‌, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మేరకు మైదానాన్ని వినియోగించుకోవాలి.. తిలకించడానికి వచ్చే ప్రజలు, పర్యాటకులకు అవసరమైన స్థలం, విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న బస్సులు, టూ వీలర్స్‌, వీఐపీల కార్ల పార్కింగ్‌కు అవసరమైన స్థల కేటాయింపులపై అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. మైదానంలో ఉన్న చిన్నపాటి కాలువలపై సిమెంట్‌ పలకలు వేసి మరింత స్థలాన్ని వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్‌ను ఆదేశించారు. విద్యార్థులు తరలింపు, వారికి భోజన సదుపాయాలు, మంచినీరు ఏర్పాటుతో పాటు పిల్లలు ఎవరు డీహైడ్రేషన్‌కు గురికాకుండా అవసరమైన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని టీడబ్ల్యూ డీడీ రజిని, డీఈవో బ్రహ్మాజీరావులను ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. యోగాసనాల కార్యక్రమానికి సంబంధించిన నమూనాను అధికారులు కలెక్టర్‌కు మ్యాప్‌ ద్వారా వివరించారు.

Updated Date - Mar 30 , 2025 | 01:17 AM