Share News

బెట్టింగ్‌ భూతం

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:14 AM

ఎంవీపీ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు.

బెట్టింగ్‌ భూతం

  • రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు

  • ఆ ఊబిలో దిగితే అంతేసంగతులు

  • జీవితాలు నాశనం

  • ఐపీఎల్‌ ప్రారంభంతో మళ్లీ యాక్టివ్‌ కానున్న మాఫియా

  • పిల్లలపై ఒక కన్నేసి ఉంచాల్సిందే

  • వీలైనంత వరకూ సాయంత్రం వేళల్లో ఇంట్లో ఉండేలా చూడాలని సైకాలజిస్టుల సూచన

విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

ఎంవీపీ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు. గడిచిన కొద్దినెలలుగా సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ కాయడం అలవాటు చేసుకున్నాడు. మొదట తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు కాసేవాడు. తరువాత స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేశాడు. ఆఖరికి ఇంట్లో ఉన్న డబ్బులు, తన తండ్రికి తెలియకుండా ఆయన అకౌంట్‌లో ఉన్న డబ్బులు కూడా లాగేసి బెట్టింగ్‌ కాశాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసేసరికి రూ.15 లక్షల వరకూ పోగొట్టాడు. అప్పటికే బెట్టింగ్‌ వ్యసనానికి బానిసైనట్టు గుర్తించిన తల్లిదండ్రులు కుమారుడికి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు.

నగరానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి స్నేహితుడి ద్వారా బెట్టింగ్‌ అలవాటైంది. మొదట్లో జీతం, ఆ తరువాత అప్పులు చేసి బెట్టింగ్‌ కాశాడు. భారీగా అప్పులు పెరిగిపోవడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటికే తీవ్రమైన కుంగుబాటుకు గురైన కుమారుడి విషయం తెలుసుకున్న స్టీల్‌ప్లాంటులో పనిచేసే అతని తండ్రి కొన్ని ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాడు. సదరు యువకుడు మొత్తం కోటి రూపాయలకుపైగా బెట్టింగ్‌లో నష్టపోయాడు.

గాజువాక ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. మొదట్లో తల్లిదండ్రులు ఖర్చులకు ఇచ్చిన డబ్బులు బెట్టింగ్‌ కాసేవాడు. ఆ తరువాత అప్పులు చేశాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసేసరికి ఐదు లక్షల రూపాయల వరకూ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు.

క్రికెట్‌ బెట్టింగ్‌ జీవితాలను నాశనం చేస్తోంది. ఎంతోమంది ఈ ఊబిలోకి దిగి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వరకూ అన్ని వర్గాలు, వయసులకు చెందినవారు ఈ బెట్టింగ్‌కు అలవాటుపడుతున్నారు. బెట్టింగ్‌ మాఫియాకు ఐపీఎల్‌ అతిపెద్ద పండుగని చెప్పాలి. ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌పై వేల కోట్ల రూపాయల బెట్టింగ్‌ జరుగుతుంది. అందుకే ఐపీఎల్‌ కోసం బెట్టింగ్‌ మాఫియా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటుంది.

యాప్‌లతో సర్వనాశనం

బెట్టింగ్‌ రెండు రకాలుగా కాస్తుంటారు. బుకీల ద్వారా బెట్టింగ్‌ వేసేవాళ్లు ఒకరకం. బుకీ ఎక్కడో ఉంటాడు. అతనితో బెట్టింగ్‌ ఫోన్‌ల ద్వారా వేస్తారు. ఒకవేళ బుకీ ఫోన్‌కు స్పందించకపోయినా, అతను పోలీసులకు దొరికినా డబ్బులు రావు. రెండో రకం బెట్టింగ్‌ యాప్స్‌. ఇవి అత్యత ప్రమాదకరమైనవి. ప్రస్తుతం మార్కెట్‌లో 20కుపైగా బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంలో ఉన్నాయి. వివిధ రకాల ఆఫర్లు, బోనస్‌ల పేరిట యువతను ఈ యాప్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి ఈ యాప్స్‌ను వినియోగిస్తే బయటకు రావడం అంత తేలికకాదు. వివిధ రకాల పేమెంట్‌ యాప్స్‌ నుంచి నేరుగా ఆయా అకౌంట్లలోకి డబ్బులు జమ చేసి...క్షణాల్లో బెట్టింగ్‌ వేసుకునే వెసులుబాటు ఉండడంతో ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు రూ.లక్షల్లో నష్టపోయి ప్రాణాలను తీసుకునే వరకూ వెళుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. బెట్టింగ్‌ వల్ల నష్టపోయిన వాళ్లే తప్ప...లాభపడిన వాళ్లు ఒక్కరు కూడా కనిపించరు.

కుటుంబ సభ్యుల బాధ్యత..

బెట్టింగ్‌కు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఈ రెండు నెలలపాటు ఇంటికి దూరంగా వెళ్లకుండా చూడాలి. ఒకవేళ వెళ్లినా రాత్రి ఇంటికి వచ్చేలా జాగ్రత్తపడాలి. వారికి ప్రత్యేక గదులు ఇవ్వకుండా అందరూ కలిసి ఉండడం మంచిది. అకౌంట్లలో భారీ మొత్తాలు లేకుండా చూసుకోవాలి. పిల్లల అకౌంట్లలో డబ్బులు లేకుండా చూసుకోవడం అత్యంత కీలకం. వారి ఫోన్లలో పేమెంట్‌ యాప్స్‌ ఉంటే వాటిని తీసేయాలి. అలాగే, ఉద్యోగుల విషయంలో కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. మ్యాచ్‌ చూస్తూ ఫోన్లు మాట్లాడుతున్నా, అదే పనిగా ఫోన్‌ పట్టుకుని మ్యాచ్‌లు వీక్షిస్తున్నా, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నా, మ్యాచ్‌ చూస్తూ అతిగా స్పందిస్తున్నా...ఒక్కోరోజు అధిక మొత్తంలో డబ్బులు తెచ్చి ఇస్తున్నా, కొన్నిసార్లు అవసరానికి మించి డబ్బు అడుగుతున్నా అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ బెట్టింగ్‌ కాసేందుకు అవకాశం ఉండే అంశాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

బయటకు తీసుకురావడం ఒకింత క్లిష్టమైన ప్రక్రియ

- డాక్టర్‌ ఎన్‌ఎన్‌ నిహాల్‌, మానసిక నిపుణులు

బెట్టింగ్‌ వ్యసనం బారినపడిన వారిని బయటకు తీసుకురావడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ వ్యసనానికి గురైనవాళ్లు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతుంటారు. ఆర్థికంగా తీవ్ర అగాధంలోకి వెళ్లిపోతారు. మొదట్లో తక్కువ మొత్తంతోనే ప్రారంభిస్తారు. ఆ తరువాత అది ఏ స్థాయికి వెళుతుందో చెప్పలేము. డబ్బులు దొరికిన చోటల్లా అప్పులు వాడేస్తుంటారు. అది ఎంత అన్న విషయం కూడా వారికి పట్టదు. బయటకు వచ్చేసరికి రూ.లక్షలు దాటుతుంది. ఇటువంటి వారిని వేగంగా గుర్తించి కౌన్సెలింగ్‌, కొన్నిరకాల మందులు ఇవ్వడం ద్వారా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది.

Updated Date - Mar 23 , 2025 | 01:14 AM