Share News

దాడి ఘటనపై ఇరువర్గాలపై కేసులు

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:09 AM

దాడి ఘటనపై ఇరువర్గాలపై కేసులు

దాడి ఘటనపై ఇరువర్గాలపై కేసులు

గొలుగొండ మార్చి, 21 (ఆంధ్రజ్యోతి): దాడి ఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌. రామారావు తెలిపారు. శుక్రవారం ఎస్‌ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తమల్లంపేట గ్రామ శివారుల్లో పదేళ్లుగా రొంగలి సత్యవతి రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. తమ కుటుంబ ఆస్తి పంపకాల్లో భాగంగా మరొకరు ఆ రేకుల షెడ్డు తమదంటూ కోర్టును ఆశ్రయించారు. ఇదిలావుండగా గురువారం సాయంత్రం స్థానిక సర్పంచ్‌ పోలిరెడ్డి రాజబాబు షెడ్డును ఎక్స్‌కవేటర్‌తో దగ్గరుండి తొలగిస్తుండగా సమాచారం తెలుసుకున్న సత్యవతి కుటుంబ సభ్యులు కొంత మంది అక్కడకు చేరుకుని సర్పంచ్‌పై దాడికి దిగారు. సర్పంచ్‌ తలకు గాయం కాగా, రెండో వర్గానికి చెందిన రొంగలి సత్యవతికి కూడా గాయం కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామారావు తెలిపారు.

రైలు ఢీకొని గాయపడిన వ్యక్తి మృతి

పాయకరావుపేట, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజుల క్రితం పాయకరావుపేటలో రైలు పట్టాలు దాటుతూ రైలు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్టు తుని జీఆర్‌పీ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన స్థానిక రాజీవ్‌కాలనీ రైల్వే గేటు సమీపంలో ఒక వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అక్కడ స్పృహలోకి వచ్చినప్పుడు తన పేరు పసగడుగుల సత్యనారాయణ(55) అని, కోటవురట్ల మండలం పి.కొత్తపల్లి గ్రామం అని చెప్పాడు. గ్రామంలో టైలరింగ్‌ షాపు నిర్వహిస్తుంటాడు. డి.పోలవరంలో బంధువుల ఇంటికి వెళుతుండగా పాయకరావుపేటలో ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

క్వారీలో ప్రమాదం.. డ్రిల్లింగ్‌ కార్మికుడి మృతి

కొత్తూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కుంచంగి గ్రామంలో ఉన్న ఒక క్వారీలో డ్రిల్లింగ్‌ చేస్తున్న కార్మికుడిపై రాళ్లు పడడంతో గాయపడి మృతిచెందాడు. అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా వున్నాయి. ఒడిశాకు చెందిన కెసబ్‌ జాని (30) కుంచంగిలోని పలు క్వారీల్లో డ్రిల్లింగ్‌ పనులు చేస్తుంటాడు. శుక్రవారం బండి భవానీ క్వారీలో డ్రిల్లింగ్‌ చేస్తుండగా ప్రకంపనలు రావడంతో పై నుంచి రాళ్లు మీద పడడంతో జాని తలకు తీవ్ర గాయమైంది. సహచర కార్మికులు చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పరవాడ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి- గాజువాక రహదారిలోని బొట్టవానిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్‌ రాష్ట్రానికి చెందిన రాకేశ్‌కుమార్‌ (24) అగనంపూడిలో నివాసం ఉంటూ గ్యాస్‌ కట్టర్‌ పనులు చేస్తుంటాడు. శుక్రవారం ఉదయం అగనంపూడి నుంచి ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం వెళుతుండగా బొట్టవానిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్నది. దీంతో రాకేశ్‌కుమార్‌కు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు.

చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడి మృతి

డుంబ్రిగుడ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతంగి పంచాయతీ పెదపాడులో గిరిజనుడు జీలుగు చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదపాడుకు చెందిన బడ్నాయిని బాలన్న (55) గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జీలుగు చెట్టెక్కారు. పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

బస్సును ఢీకొన్న బైక్‌.. ఒకరి మృతి

మాకవరపాలెం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జి.గంగవరం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్ట్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి గుడివాడ తాతీయలు మృతి చెందారు. మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన రిటైర్ట్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి గుడివాడ తాతీయలు(62) శుక్రవారం ఉదయం నర్సీపట్నం బైక్‌పై వెళ్లారు. అక్కడ పనులు చూసుకొని మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తిరిగి పెద్దిపాలెం వస్తుండగా జి.గంగవరం వద్ద అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళుతున్న ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో తాతీయలు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ.దామోదరనాయుడు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

అనకాపల్లి టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నట్టు పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అనకాపల్లి వచ్చినట్టు కుటుంబ సభ్యులు ఫొటో పంపి సమాచారం అందించాడు. దీంతో అక్కడి పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఉడ్‌పేట ప్రాంతానికి వెళ్లి యువకుడి ఆత్మహత్య ప్రయత్నాన్ని అడుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ చేసి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

సామాజిక కార్యకర్తపై దాడి

నర్సీపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సామాజిక కార్యకర్త శివ నారాయణరావుపై జరిగిన దాడిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం శివనారాయణరాజు ఇంటి వద్ద కాపుకాసి అతన్ని మేడ మెట్ల మీదకు తీసుకు వెళ్లి దాడి చేసి, అంతు చూస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు కారు అనకాపల్లికి చెందినదిగా గుర్తించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు అనేది ఇంకా తేలలేదని, విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.

బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు

నర్సీపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మెట్టపాలెం పంచాయతీ కసిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బర్ల సంతోషి తన ఇంట్లోని బంగారం గొలుసు పోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రూరల్‌ సీఐ రేవతమ్మ అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం అయ్యన్న కాలనీకి చెందిన మాకిరెడ్డి నాగరాజు జనవరి 27న కసిరెడ్డిపాలెం వెళ్లి సంతోషి బంగారం గొలుసు దొంగతనం చేసి, అతని స్నేహితుడు అల్లంపల్లి ఈశ్వరరావుకి తాకట్టు పెట్టమని ఇచ్చాడు. అతను బ్యాంకులో రూ.1,02,426లకు తాకట్టు పెట్టాడు. మాకిరెడ్డి నాగరాజుకి రూ.80 వేలు ఇచ్చి, మిగిలిన డబ్బులుసొంతానికి వాడుకున్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని ఆమె తెలిపారు.

రెండు లారీలకు రూ.92 వేల జరిమానా

మునగపాక, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి వైపు నుంచి అచ్యుతాపురం వైపు బండరాళ్లను పరిమితి మించి రవాణా చేస్తున్న రెండు లారీలను మునగపాక జంక్షన్‌ వద్ద పట్టుకున్నట్టు ఎస్‌.ఐ పి.ప్రసాదరావు తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని ఆర్టీవో దృష్టికి తీసుకెళ్లగా.. ఒక్కో లారీకి రూ.46 వేల చొప్పున జరిమానా విధించారని చెప్పారు.

గ్రావెల్‌ తరలిస్తున్న లారీ పట్టివేత

సబ్బవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగవరం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్న లారీని వీఆర్వో రాంబాబు శుక్రవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. గంగవరం నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తహసీల్దార్‌ చిన్నికృష్ణ ఆదేశాల మేరకు అజనగిరి కాలనీ వద్ద మాటు వేసినట్టు చెప్పారు. గంగవరం నుంచి గ్రావెల్‌ లోడుతో వస్తున్న లారీని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు వీఆర్వో తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 01:09 AM