కైలాసగిరి అభివృద్ధికి ప్రణాళిక
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:16 AM
కైలాసగిరిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రాజెక్టులు
టెక్నికల్ కన్సల్టెంట్ కోసం ప్రకటన జారీ
2019లోనే మాస్టర్ ప్లాన్ తయారీ..
ప్రపంచ బ్యాంకు నిధులు ఆగిపోవడంతో ముందుకుసాగని పనులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కైలాసగిరిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటక కేంద్రంగా మరింత విస్తరించాలని, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ యత్నిస్తోంది. దీనిని పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టనున్నారు. దీనిపై ప్రణాళిక రూపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు ముందుకు రావాలని ప్రకటన జారీచేసింది.
హుద్‌హుద్ (2014) తుఫాన్‌కు కైలాసగిరి బాగా దెబ్బతింది. దీని పునర్మిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ముందుకువచ్చింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేశారు. కైలాసగిరి విస్తీర్ణం మొత్తం 380 ఎకరాలు కాగా అందులో 90 ఎకరాలను అభివృద్ధి చేయడానికి రూ.56 కోట్లతో ప్రణాళిక రూపొందించి పంపించారు. కైలాసగిరిపై భద్రత పెంచాలని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కిందనున్న ప్రధాన ప్రవేశద్వారం శివాలయం దగ్గర నుంచి తెలుగు మ్యూజియం వరకు, అటు హనుమంతవాక మెట్ల మార్గం, ఇటు రోప్‌వే వైపు 120 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. శంఖు చక్రాల దగ్గరున్న భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి దానికి అనుసంధానం చేయాలనుకున్నారు. పర్యాటకులు వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి అదనంగా శివాలయం దగ్గర ఒకటి, తెలుగు మ్యూజియం దగ్గర మరో పార్కింగ్ సౌకర్యం కల్పించాలనుకున్నారు. మ్యూజియం దగ్గరకు నేరుగా కార్లు, బస్సులతో వెళ్లిపోయేలా ప్రత్యామ్నాయంగా వేసిన రహదారిని అభివృద్ధి చేద్దామనుకున్నారు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్, స్కై టవర్, జిప్ లైనర్, జోర్బింగ్, అడ్వెంచర్ గేమ్స్ వంటివి ఏర్పాటుచేస్తామని ప్రతిపాదించారు. అయితే పనులు సరిగ్గా నిర్వహించకపోవడం, నిధులు వేరే వాటికి మళ్లించడంతో ప్రపంచ బ్యాంకు రూ.13 కోట్లు మాత్రమే ఇచ్చి, మిగిలిన మొత్తం ఆపేసింది. దాంతో చేయాలనుకున్న పనులు ఆగిపోయాయి.
కొన్ని అందుబాటులోకి...
ప్రపంచ బ్యాంకు నిధులు రావని అర్థమయ్యాక పీపీపీలో జిప్‌లైనర్, స్కై స్లైకింగ్ ఏర్పాటుచేశారు. అలాగే గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతోంది. తెలుగు మ్యూజియానికి వెళ్లే మార్గం పూర్తికాలేదు. పార్కింగ్ సదుపాయాలు అదనంగా ఏర్పాటు చేయలేదు. కొన్ని సీసీ టీవీ కెమెరాలు పెట్టారు. అయితే ఉన్న వాటిలో చాలావరకూ సరైన నిర్వహణ లేక మూలకుచేరుతున్నాయి. ఇటీవల సర్క్యులర్ రైలు తరచూ మొరాయిస్తుండడంతో పూర్తిగా నిలిపేశారు. రోప్‌వే వద్ద అగ్ని ప్రమాదం జరిగిందని తాత్కాలికంగా ఆపేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తెస్తేనే పునరుద్ధరిస్తామని స్పష్టంచేశారు. బ్యాటరీ కార్లకు అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని వాటిని ఆపేశారు. ఇప్పుడు కైలాసగిరిపైకి ఎవరైనా వెళితే...380 ఎకరాలను కాలినడకనే తిరగాలి. ఎటువంటి వాహన సదుపాయం లేదు.
పాత ప్లాన్లకు కొత్త కలరింగ్
వీఎంఆర్‌డీఏ ఏదైనా మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ధి పనులకు టెండర్లు పిలిస్తే గతంలో పనిచేసిన కన్సల్టెన్సీలు వారి వద్ద అప్పటికే ఉన్న సమాచారంతో కొత్త లెక్కలు వేసి లక్షలాది రూపాయలు కన్సల్టెన్సీ ఫీజులు కింద తీసుకుంటున్నాయి. లీ అసోసియేట్స్ వంటి సంస్థలను ఇక్కడి అధికారులు ఆపినా వారు అమరావతి వెళ్లి అక్కడి నుంచి చెప్పించుకొని కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పాత డీపీఆర్‌ను ఒకసారి చూసి, అవసరమైన మార్పులు చేసుకొని ముందుకు వెళితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.