శారదా పీఠంలో నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ ఆరా
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:17 AM
చినముషిడివాడలోని శారదా పీఠంలో చేపట్టిన నిర్మాణాలపై జీవీఎంసీ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం శనివారం ఆరా తీసింది.

అనుమతులకు సంబంధించిన పత్రాలు సేకరణ
పెందుర్తి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
చినముషిడివాడలోని శారదా పీఠంలో చేపట్టిన నిర్మాణాలపై జీవీఎంసీ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం శనివారం ఆరా తీసింది. నగర సిటీ ప్లానర్ మీనాకుమారి నేతృత్వంలో ఎనిమిదో జోన్ ఏసీపీ రామలింగేశ్వరరెడ్డి, టీపీవో గోపన్న పీఠానికి వెళ్లి నిర్మాణాలకు అనుమతులపై నిర్వాహకులతో మాట్లాడారు. ‘పీఠం వెనుక మోసం’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో ఇప్పటికే పెందుర్తి తహసీల్దార్ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో సర్వే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పీఠంలో అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించారు. చినముషిడివాడ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి జీవీఎంసీలో విలీనమయ్యేంత వరకూ పీఠంలో చేపట్టిన నిర్మాణాలపై సిటీ ప్లానర్ మీనాకుమారి ఆరా తీసినట్టు తెలిసింది. నిర్వాహకులు కొన్ని డాక్యుమెంట్లు అందజేశారు. నిర్మాణాలకు అనుమతులు, ఇతర అంశాలను పరిశీలించి ఉన్నతాధికారులకు తుది నివేదిక అందజేయనున్నామని ఏసీపీ రామలింగేశ్వరరెడ్డి తెలిపారు.
నేడు, రేపు పలు రైళ్లు రద్దు
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ పరిధిలో నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈనెల 23, 24 తేదీల్లో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశామని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 23న (ఆదివారం) గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239)ను, 24న విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240), గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239), కాకినాడ-విశాఖ మెము పాసింజర్ (17267), విశాఖ-కాకినాడ మెము పాసింజర్ (17268), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్ (67285), విశాఖ-రాజమండ్రి మెము పాసింజర్ (17286), విశాఖ-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22875), గుంటూరు-విశాఖ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22876)లను రద్దు చేశామని పేర్కొన్నారు. అలాగే 25న కూడా విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలన్నారు.