Share News

తేనె జాడ చూపే ‘హనీ గైడ్‌’

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:57 PM

పక్షుల అరుపులన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో సందర్భానికి ఒక్కోలా ఉంటుంది. వాటి అరుపులను అర్థం చేసుకున్నవారికి చుట్టు పక్కల పరిస్థితులు ఇట్టే అర్థమవుతాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని పక్షులు మనుషులతో సంభాషిస్తాయి.

తేనె జాడ చూపే ‘హనీ గైడ్‌’

తేనె సేకరించాలంటే ముందుగా తేనె తుట్టెలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఏ కొండపైన, ఏ చెట్టుకు ఉన్నాయో వెదకాలి. తేనె సేకరించడం సులభమే. తేనెతుట్టెలను కనిపెట్టడమే కష్టం. ఆ పని సులువుగా చేసిపెడుతుందో పక్షి. తేనె తుట్టెలు ఎక్కడెక్కడున్నాయో దారి చూపిస్తుంది. ‘హనీ గైడ్‌’ అనే ఈ పక్షి ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తుంది. అక్కడి గిరిజనులకు దీనితో ప్రత్యేక అనుబంధం ఉంది.

book10.2.jpg

పక్షుల అరుపులన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో సందర్భానికి ఒక్కోలా ఉంటుంది. వాటి అరుపులను అర్థం చేసుకున్నవారికి చుట్టు పక్కల పరిస్థితులు ఇట్టే అర్థమవుతాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని పక్షులు మనుషులతో సంభాషిస్తాయి. అలాంటి ఒక పక్షి ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, మొజాంబిక్‌ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పక్షి అక్కడ నివసించే గిరిజనులతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉంటుంది. అక్కడి ప్రజల జీవనాధారమైన తేనె కోసం దారి చూపిస్తుంది. తేనెతెట్టెలు ఎక్కడున్నాయో ప్రత్యేకమైన అరుపుల ద్వారా తెలియజేస్తుంది. ఈ పక్షిని గ్రేటర్‌ హనీ గైడ్‌, ఇండికేటర్‌ బర్డ్‌ అని పిలుస్తారు.


నీకది...నాకిది...

హనీగైడ్‌ తేనెతుట్టెలను కనిపెట్టడంలో దిట్ట. అయితే ఆ తేనెతుట్టెల జాడ మనుషులకు తెలియజేయాల్సిన అవసరం దానికి ఏముంది? అనే సందేహం రావచ్చు. హనీగైడ్‌ మైనాన్ని ఆహారంగా తీసుకుంటుంది. తేనెటీగలు తేనెను నిల్వ చేసే గదులు మైనంతో ఉంటాయి. హనీగైడ్‌ తేనెతుట్టెను కనిపెట్టిన వెంటనే... తేనె సేకరించే వారికి తెలిసేలా బిగ్గరగా శబ్దం చేస్తుంది. స్పష్టంగా మనుషుల దగ్గరకు వచ్చి సంకేతాలు ఇస్తుంది. ఆ పక్షి అరుపులను తేనె సేకరించేవాళ్లు ఇట్టే పసిగడతారు. తేనెతుట్టెను కనిపెట్టాక పొగ పెట్టి తేనెటీగలను తరిమేస్తారు. ఆ తర్వాత తేనె సేకరిస్తారు. తేనెతుట్టెను చూపించినందుకు హనీ గైడ్‌కు మైనాన్ని వదిలేస్తారు.

book10.3.jpg


కొన్ని శతాబ్దాలుగా అక్కడ ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు గిరిజనులు. సాధారణంగా గిరిజనులు అడవుల్లో పక్షులను వేటాడతారు. కానీ అక్కడ ఒక పక్షి గిరిజనులకు సహాయపడటం ఆశ్చర్యమే. ఈ విషయమై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ‘పక్షితో సంభాషించేందుకు అవసరమైన సంకేతాలను అక్కడి గిరిజనులు నేర్చుకున్నారు. అలాగే పక్షుల వైపు కూడా అభ్యాస ప్రక్రియ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బ్రెయిన్‌వుడ్‌ తెలిపారు.

‘పక్షులు మీతో ఎలా సంభాషిస్తున్నాయ’ని గిరిజనులను అడిగితే... ‘అవి వాటికున్న అవగాహన ద్వారా స్పందిస్తున్నాయి. మేం చేసే శబ్దాలకు స్పందిస్తున్నాయో లేదో నిర్దిష్టంగా చెప్పలేం’ అని అంటున్నారు. మొత్తానికి గిరిజన తెగ హనీ గైడ్‌తో చక్కని అనుబంధాన్నే ఏర్పరచుకుంది.

Updated Date - Mar 23 , 2025 | 12:57 PM