Share News

ఉక్కుపై కొరవడిన స్పష్టత

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:20 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో కొనసాగుతున్న అనిశ్చితిపై కేంద్రం సరైన సమాధానం ఇవ్వడం లేదు.

ఉక్కుపై కొరవడిన స్పష్టత

  • ఎంపీల ప్రశ్నలకు మంత్రిత్వ శాఖ కప్పదాటు సమాధానాలు

  • బ్యాంకుల అప్పులు తీర్చడానికి, పెద్ద పెద్ద సంస్థల బకాయిలు చెల్లించడానికి ప్యాకేజీ మొత్తం వినియోగం

  • జీతం బకాయిలు చెల్లించరా?... అంటే...జవాబు శూన్యం

  • ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో కొనసాగుతున్న అనిశ్చితిపై కేంద్రం సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంటు సక్రమంగా నడవడానికి రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినా, ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరుకు 205 శాతం జీతాల బకాయి ఉంది. ఇంకో వారం రోజులు ఆగితే మూడు నెలల జీతం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నలు సంధించినా వాటికి సూటిగా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు.

కేంద్రం అందించిన ఆర్థిక ప్యాకేజీ మొత్తాన్ని బ్యాంకుల అప్పులు తీర్చడానికి, పెద్ద పెద్ద సంస్థల బకాయిలు చెల్లించడానికి వినియోగిస్తున్నారు. ఉద్యోగులకు బకాయిపడిన జీతాల కోసం ఆ నిధులు ఉపయోగించడం లేదు. కార్మిక సంఘాలు ప్రశ్నిస్తే సీఎండీ సహా ఫైనాన్స్‌ విభాగంలో ఎవరూ నోరు విప్పడం లేదు. పైగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, కాంట్రాక్టు కార్మికులను తొలగించడం ద్వారా అశాంతి వాతావరణం కొనసాగేలా చేస్తున్నారు. ఒకవైపు ఆర్థిక సాయం చేస్తూనే, మరోవైపు స్టీల్‌ప్లాంటును 100 శాతం విక్రయించే ప్రతిపాదన వెనక్కి తీసుకోలేదని ప్రకటనలు గుప్పిస్తున్నారు. రాష్ర్టానికి చెందిన ఎంపీలు సీఎం రమేశ్‌, బాలశౌరి, మల్లు రవి వేర్వేరుగా ఇటీవల లోక్‌సభలో ప్రశ్నలు సంధించారు. స్టీల్‌ప్లాంటుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని వినియోగించడానికి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు ఏమిటి?, ఉద్యోగులు, కార్మికులకు నెలలకొద్దీ జీతాలు ఇవ్వని విషయం వాస్తవమేనా?, అందించిన ప్యాకేజీ నుంచి జీతాలు చెల్లించే అవకాశం ఉందా?, వారికి ఉద్యోగ భద్రతపై తీసుకున్న చర్యలు ఏమిటి? అంటూ ప్రశ్నలు సంధించారు.

ఇదీ సమాధానం

ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానాలు సూటిగా లేకపోవడం గమనార్హం. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించామని, అందులో 10,300 కోట్లు ఈక్విటీగా మార్చామని, మరో రూ.1,140 కోట్లు వర్కింగ్‌ కేపిటల్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఉక్కు అమ్మకాల ద్వారా రూ.12,615 కోట్ల ఆదాయం వచ్చిందని, అప్పటికి రూ.3,943.43 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం అప్పులు రూ.38,965 కోట్లకు చేరాయని వివరించారు. ఉద్యోగులకు సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలకు కొంత కొంత జీతాలు చెల్లించామని, ఇంకా బకాయి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు.

ప్యాకేజీలో జీతాలు లేనట్టే..

అందించిన ప్యాకేజీ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పారా? లేదా? అన్న ప్రశ్నకు మంత్రిత్వ శాఖ సమాధానం ఇవ్వలేదు. అలాగే వారి ఉద్యోగ భద్రతకు తీసుకున్న చర్యలు ఏమిటి?...అనే దానిపైనా జవాబు లేదు. కానీ ఉద్యోగుల పనితీరు, పూర్తిస్థాయి ఉత్పత్తి వంటి లక్ష్యాలు ఇచ్చి, ప్లాంటు నష్టాల నుంచి బయటపడే చర్యలు తీసుకున్నామని, ఈ ఆర్థిక సాయం కొనసాగుతుందని తెలిపింది.

నేడు పాదయాత్ర

గాజువాక నుంచి కూర్మన్నపాలెంలోని శిబిరం వరకు..

కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

గాజువాక, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధి రక్షణ యాత్ర పేరుతో ఆదివారం పాదయాత్ర చేపట్టనున్నట్టు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు కొత్త గాజువాకలో పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. పాత గాజువాక, చినగంట్యాడ, శ్రీనగర్‌, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వరకు పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:20 AM