Share News

ఈకేవైసీకి డెడ్‌లైన్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:14 AM

బియ్యం కార్డుల్లో పేర్లు కలిగినవారంతా ఈకేవైసీ (ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌...ఇది వినియోగదారుడు/కస్టమర్‌ గుర్తింపును డిజిటల్‌ పద్ధతిలో ధ్రువీకరించుకునే ప్రక్రియ) చేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర పౌర సరసరఫరాల శాఖ నిర్ణయించింది.

ఈకేవైసీకి డెడ్‌లైన్‌

  • బియ్యం కార్డుల్లో పేరు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెల 31లోగా రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి

  • ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ సూచన

  • జిల్లాలో 5.29 లక్షల బియ్యం కార్డులు...సభ్యులు 15.91 లక్షల మంది

  • 14.35 లక్షల మంది సభ్యుల ఈకేవైసీ పూర్తి...

  • 1.64 లక్షల మంది పెండింగ్‌

  • రేషన్‌ డీలర్లు, సచివాలయాలకు జాబితాలు

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

బియ్యం కార్డుల్లో పేర్లు కలిగినవారంతా ఈకేవైసీ (ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌...ఇది వినియోగదారుడు/కస్టమర్‌ గుర్తింపును డిజిటల్‌ పద్ధతిలో ధ్రువీకరించుకునే ప్రక్రియ) చేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర పౌర సరసరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలు తీసుకునే ప్రతి ఒక్కరూ తమ వేలిముద్ర (బయోమెట్రిక్‌) వేయడం ద్వారా ఈకేవైసీని పూర్తిచేసుకోవాలని సూచిస్తోంది. ఆ బాధ్యతను క్షేత్రస్థాయిలో రేషన్‌ డీలర్‌, గ్రామ/వార్డు సచివాలయాలకు అప్పగించింది.

జిల్లాలో 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా, 15.91 లక్షల మంది సభ్యులు (యూనిట్లు) ఉన్నారు. గత ఏడాది గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 14.35 లక్షల మంది సభ్యుల ఈకేవైసీ పూర్తిచేశారు. మిగిలిన వారి ఈకేవైసీ కూడా పూర్తిచేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న సభ్యుల వివరాలు రేషన్‌ డిపోకు, సచివాలయాలకు పంపించింది. అయితే ఈకేవైసీ పూర్తిచేయని సభ్యుల వివరాలు ఇచ్చిన పౌర సరఫరాల శాఖ వారి ఫోన్‌ నంబర్లు జాబితాలో పొందుపర్చలేదు. దీనిపై డీలర్లు పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యమే కానీ నగరాలు, మునిసిపాలిటీలలో కష్టమని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఎండీయూ వ్యవస్థ ఏర్పాటు తరువాత డీలర్‌లకు, కార్డుదారుడికి మధ్య సంబంధం తెగిపోయింది. ఇంకా చెప్పాలంటే పోర్టబిటిటీ సదుపాయం రావడంతో డీలర్‌, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరకులు తీసుకునే వెసులుబాటు వచ్చింది. అందువల్ల బియ్యం కార్డుదారుల్లో కొందరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఫోన్‌ నంబర్‌ లేకుండా ఈకేవైసీ పూర్తిచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. డీలర్లు, సచివాలయాలతోపాటు ఎండీయూ వాహనాల ద్వారా వీధుల్లో ప్రచారం చేయడం, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక ప్రాంతంలో వాహనం ఉంచి అక్కడకు ఈకేవైసీకి రావాలని చెబితే కొంతవరకూ పూర్తిచేయవచ్చునని డీలర్లు అంటున్నారు. మంగళవారంతో బియ్యం పంపిణీ పూర్తయిందని, నెలాఖరు వరకు ఎండీయూ వాహనాలు ఖాళీగా ఉంటున్నందున వారి సేవలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అంతే తప్ప పూర్తిగా డీలర్లకు బాధ్యతలు అప్పగిస్తే ఈకేవైసీ పూర్తిచేయడం సాధ్యం కాదని స్పష్టంచేస్తున్నారు.

బియ్యం కార్డులో పేరు కలిగిన ఆరు నుంచి 60 సంవత్సరాల వయస్సుగల సభ్యులంతా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని ఇన్‌చార్జి డీఎస్‌వో కల్యాణి తెలిపారు. తమ సమీపంలో ఉన్న రేషన్‌ డిపో వద్దకు వెళ్లి ఈపోస్‌ మిషన్‌లో వేలిముద్ర వేసి ఈకేవైసీ పూర్తిచేయాలని, వివరాలకు అందుబాటులో ఉన్న సచివాలయాలు, తహసీల్దార్‌/సహాయ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సంప్రతించాలన్నారు. ఈ ప్రక్రియ మార్చి 31వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 01:14 AM