మన్యంలో భిన్న వాతావరణం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:00 PM
మన్యంలో బుధవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం దట్టంగా పొగమంచు కురవగా, మధ్యాహ్నం తీవ్రంగా ఎండకాసింది.

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షం
పాడేరు, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం దట్టంగా పొగమంచు కురవగా, మధ్యాహ్నం తీవ్రంగా ఎండకాసింది. సాయంత్రం ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు ప్రాంతంలో వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఏజె న్సీలో భిన్నమైన వాతావరణం ఏర్పడుతున్నది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు, తరువాత నుంచి వేసవి వాతావరణం నెలకొని ఎండ కాసింది. మధ్యాహ్నం వేళలో అయితే ఎండ తీవ్ర ప్రతాపం చూపింది. సాయంత్రం ఏజెన్సీలో ఏదో చోట వర్షం పడడం విశేషం.
డుంబ్రిగుడలో 37.0 డిగ్రీల ఉష్ణోగ్రత
డుంబ్రిగుడలో 37.0 డిగ్రీలు, కొయ్యూరులో 36.7, పాడేరులో 35.8, ముంచంగిపుట్టులో 35.4, పెదబయలులో 35.0, హుకుంపేటలో 34.9, అరకులోయలో 34.0, అనంతగిరిలో 33.3, జీకేవీధిలో 33.0, జి.మాడుగుల, చింతపల్లిలో 32.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో భారీ వర్షం
ముంచంగిపుట్టు: మండల పరిధిలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తిస్తుంది. బుధవారం సాయంత్రం సుమారు గంటసేపు కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంతో పాటు జోలాపుట్టు, సంగడ, పెదబయలు, కుమడ, లక్ష్మీపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది. అకాల వర్షాల వల్ల జీడి, మామిడి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. మండల కేంద్రం తప్పించి నుర్మతి, మద్దిగరువు, భీరం అనర్భ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాగా బుధవారం ఉదయం 8 గంటల వరకు మండలంలో మంచు దట్టంగా కురిసింది.