Share News

‘స్థానిక’ ఖాళీలకు సజావుగా ఎన్నికలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:16 AM

జిల్లాలో ఖాళీగా వున్న నాలుగు ఎంపీపీ, రెండు వైస్‌ ఎంపీపీ, పలు పంచాయతీల ఉప సర్పంచ్‌ పదవులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎంపీపీ పదవులను వైసీపీ తిరిగి నిలబెట్టుకుంది. చోడవరం, సబ్బవరం వైస్‌ ఎంపీపీలుగా వైసీపీ సభ్యులు ఎన్నికయ్యారు. అయితే సబ్బవరంలో వైసీపీ రెండుగా చీలిపోయింది. ముగ్గురు సభ్యులో గతంలో జనసేనలో చేరగా, మరో నలుగురు ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా వున్నారు. టీడీపీ, జనసేన మద్దతులో ఈ నలుగురిలో ఒకరు వైస్‌ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీకి చెందిన మిగిలిన ఎనిమిది మంది సభ్యులు ఎన్నికకు హాజరుకాలేదు.

‘స్థానిక’ ఖాళీలకు సజావుగా ఎన్నికలు

నాలుగు ఎంపీపీ స్థానాలను తిరిగి నిలబెట్టుకున్న వైసీసీ

సబ్బవరం వైస్‌ ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్‌

టీడీపీ, జనసేన మద్దతుతో వైసీపీ చీలిక వర్గానికి చెందిన సభ్యురాలి ఎన్నిక

త్వరలో జనసేనలోకి నలుగురు ఎంపీటీసీ సభ్యులు?

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో ఖాళీగా వున్న నాలుగు ఎంపీపీ, రెండు వైస్‌ ఎంపీపీ, పలు పంచాయతీల ఉప సర్పంచ్‌ పదవులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎంపీపీ పదవులను వైసీపీ తిరిగి నిలబెట్టుకుంది. చోడవరం, సబ్బవరం వైస్‌ ఎంపీపీలుగా వైసీపీ సభ్యులు ఎన్నికయ్యారు. అయితే సబ్బవరంలో వైసీపీ రెండుగా చీలిపోయింది. ముగ్గురు సభ్యులో గతంలో జనసేనలో చేరగా, మరో నలుగురు ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా వున్నారు. టీడీపీ, జనసేన మద్దతులో ఈ నలుగురిలో ఒకరు వైస్‌ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీకి చెందిన మిగిలిన ఎనిమిది మంది సభ్యులు ఎన్నికకు హాజరుకాలేదు.

దేవరాపల్లి ఎంపీపీగా బుల్లిలక్ష్మి

దేవరాపల్లి ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎ.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చింతల బుల్లిలక్ష్మి ఎన్నికయ్యారు. మండలంలో 17 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను టీడీపీకి చెందిన ఐదుగురు ఎన్నికల సమావేశానికి హాజరు కాలేదు. మూడున్నరేళ్ల క్రితం ఎంపీపీగా ఎన్నికైన కిలపర్తి రాజేశ్వరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీసీలో చేరారు. దీంతో ఆమె ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించారు.

మాకవరపాలెం ఎంపీపీగా సర్వేశ్వరరావు

మాకవరపాలెం ఎంపీపీగా వైసీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ సభ్యుడు రుత్తల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 16 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను వైసీపీకి చెందిన తొమ్మిది మంది హాజరయ్యారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు భీమబోయినపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల సత్యనారాయణ ఎంపీపీగా రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తయిన తరువాత రాజీనామా చేయడంతో ఎన్నికల నిర్వహించాల్సి వచ్చింది.

మాడుగుల ఎంపీపీగా రాజారాం

మాడుగుల ఎంపీపీగా జమ్మాదేవిపేట ఎంపీటీసీ సభ్యుడు తాళ్లపురెడ్డి రాజారాం ఎన్నికయ్యారు. మూడున్నరేళ్ల క్రితం మాడుగుల-2 ఎంపీటీసీ సభ్యుడు వేమవరపు రామధర్మజను ఎంపీపీగా ఎన్నుకున్నారు. అప్పట్లో చేసుకున్న ఒప్పందం మేరకు రెండున్నరేళ్ల తరువాత రామధర్మజ రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఎంపీపీ స్థానానికి ప్రస్తుతం నిర్వహించిన ఎన్నికలో రాజారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎస్‌.రాయవరం ఎంపీపీగా వెంకటలక్ష్మి

ఎస్‌.రాయవరం ఎంపీపీగా కొరుప్రోలు ఎంపీటీసీ సభ్యురాలు కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా ఎన్నికైన చినగుమ్ములూరు సభ్యురాలు బొలిశెట్టి శారదాకుమారి రాజకీయ కారణాలతో కొంతకాలం తరువాత రాజీనామా చేశారు. దీంతో కోన లోవలక్ష్మి ఎంపీపీ అయ్యారు. ఇటీవల ఆమె రాజీనామా చేయడంతో గురువారం ఎన్నిక నిర్వహించారు.

వైసీపీ రెబెల్‌కు టీడీపీ, జనసేన మద్దతు

సబ్బవరం వైస్‌ ఎంపీపీ-2 నారపాడు ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో జరిగిన ఎన్నికల్లో మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 15 వైసీపీ, నాలుగు టీడీపీ గెలుకున్నాయి. ఒప్పందం మేరకు వైస్‌ ఎంపీపీ-2 చొక్కాకుల గోవింద గత ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. వైస్‌ఎంపీపీ-1 దాడి వెంకటసూర్య జాన్సీలక్ష్మీరాణి గత ఏడాది జనసేనలో చేరారు. దీంతో ఆమె వైస్‌ఎంపీపీ పదవికి రాజీనామా చేయలేదు. ఈమెతోపాటు మరో ఇద్దరు వైసీపీ సభ్యులు కూడా జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం ఏడుకి పెరిగింది. వైసీపీకి చెందిన మరో నలుగురు సభ్యులు జనసేన పార్టీ నేతలతో టచ్‌లో వున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన వైస్‌ ఎంపీపీ-2 ఎన్నికకు కూటమి సభ్యులతోపాటు వైసీపీకి చెందిన నలుగురు హాజరయ్యారు. వీరిలో నారపాడు సభ్యురాలు మామిడి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈమెతోపాటు మిగిలిన ముగ్గురు వైసీపీ సభ్యులు త్వరలో జనసేనలో చేరనున్నట్టు తెలిసింది. కాగా చోడవరం వైస్‌ ఎంపీపీగా వైసీపీకి చెందిన అంభేరుపురం ఎంపీటీసీ సభ్యురాలు శరగడం లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉపసర్పంచులు...

చోడవరం మండలం రాయపురాజుపేట ఉపసర్పంచ్‌గా పసుపులేటి రామ్మూర్తి, గొలుగొండ మండలం పాకలపాడు ఉపసర్పంచ్‌గా దుంనబోయిన ఈశ్వరమ్మ, మాడుగుల ఉపసర్పంచ్‌గా జవ్వాది వరహాలరావు, మునగపాక మండలం నాగులాపల్లి ఉపసర్పంచ్‌గా గోసాల గోవిందరాజులు, తోటాడ ఉపసర్పంచ్‌గా కోట్ల హేమ, నారాయుడుపాలెం ఉపసర్పంచ్‌గా కొయ్య నల్లయ్య, రాజుపేట ఉపసర్పంచ్‌గా జెర్రిపోతుల కనకమహలక్ష్మి, రాంబిల్లి మండలం కొత్తపేట ఉపసర్పంగా బోడ్డు ప్రసాద్‌, కోటవురట్ల మండలం బాపిరాజుకొత్తపల్లి ఉపసర్పంచ్‌ పెదపూడి రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో మునగపాక పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక జరగలేదు. అచ్యుతాపురం మండలం వెదురువాడ పంచాయతీ ఉపసర్పంచ్‌ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించాల్సి వుండగా ఏఈపీఆర్డీ శ్రీరామనాయుడు అస్వస్థతకు గురికావడంతో శుక్రవారానికి వాయిదా పడింది.

Updated Date - Mar 28 , 2025 | 12:16 AM