నేడు జీవీఎంసీ బడ్జెట్ సమావేశం
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:10 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం శనివారం జరగనున్నది.

రూ.4,761 కోట్లతో రూపకల్పన
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
నోటీస్ నేపథ్యంలో ఉత్కంఠ
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశం శనివారం జరగనున్నది. సుమారు రూ.4,761 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్‌ను ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఆర్థిక సంవత్సరం ముగియకముందే కౌన్సిల్ కూడా ఆమోదించాల్సి ఉంది. ఇదిలావుండగా మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం తీర్మానం నోటీస్‌ను కూటమి కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ముందు జాగ్రత్తగా వారి పార్టీకి చెందిన కార్పొరేటర్లను బెంగళూరు తరలించేశారు. వారితో పాటు మేయర్ హరికుమారి, డిప్యూటీ మేయర్లు కూడా వెళ్లారు. జీవీఎంసీలో మొత్తం 111 మంది ఓటింగ్ సభ్యులు ఉండగా వారిలో కోరం ఉంటే తప్ప బడ్జెట్ సమావేశం నిర్వహించడానికి వీల్లేదు. మేయర్ లేకుండా ఎలా నిర్వహిస్తామని అధికారులు తర్జనభర్జన పడ్డారు. అయితే వైసీపీ ముఖ్య నేతలు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ మేయర్ హరికుమారి బెంగళూరు నుంచి శుక్రవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు. ఆమె బడ్జెట్ సమావేశానికి హాజరవుతారని వైసీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ కార్పొరేటర్లు వస్తారో, లేదో చూడాలి. ఏదెలా ఉన్నా బడ్జెట్ సమావేశం వరకూ ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు.
కూపన్లకు రూ.48 లక్షలు దుర్వినియోగం
జీవీఎంసీ బడ్జెట్ సందర్భంగా కార్పొరేటర్లు అందరికీ రూ.25 వేలు చొప్పున గిఫ్ట్ కూపన్లను అధికారులు ముందుగానే పంపిణీ చేశారు. ఈ కూపన్లకు మొత్తం రూ.48 లక్షలు వెచ్చించారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనంటూ సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా వారికి ఇచ్చిన కూపన్లను తిరిగి అధికారులకు వెనక్కి ఇచ్చేశారు. మిగిలిన కార్పొరేటర్లు అలాగే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా యలమంచిలి అపర్ణ
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన యలమంచిలి అపర్ణను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆమె 90వ వార్డు టీడీపీ అధ్యక్షుని భార్య. యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఇంకో మూడు రోజుల్లో మొత్తం కమిటీ సభ్యులను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శిగా ఎల్‌పీ నాయుడు
విశాఖపట్నం లీగల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా ఎంకే శ్రీనివాస్ ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి నమ్మి సన్యాసిరావుపై 862 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శ్రీనివాస్‌కు 1,531 ఓట్లు రాగా, సన్యాసిరావుకు 669 వచ్చాయి. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎల్‌పీ నాయుడు తన సమీప ప్రత్యర్థి పి.సుధాకర్‌పై 568 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎల్‌పీ నాయుడికి 1,028 ఓట్లు, సుధాకర్‌కు 460 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షునిగా సీహెచ్ ఆనందరావు గెలుపొందారు. కాగా ఎన్నికల్లో 2,310 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా బీఎం రెడ్డి వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రస్తుత అధ్యక్షుడు బెవర సత్యనారాయణ, కార్యదర్శి నరేష్ అభినందించారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎంకే శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషిచేస్తానని పేర్కొన్నారు.