Share News

అరకులోయ, చింతపల్లిల్లో పారిశ్రామిక పార్కులు

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:19 AM

జిల్లాలో అరకులోయ, చింతపల్లి మండలాల్లో పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి శనివారం ఆయన జూమ్‌లో నిర్వహించిన ఇండస్ర్టియల్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

అరకులోయ, చింతపల్లిల్లో పారిశ్రామిక పార్కులు
జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశం

అధికారులు ప్రణాళికలు రూపొందించాలి

వంద ఎకరాల్లో పార్కు ఏర్పాటు

అవసరమైన భూములు సేకరించాలి

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు

పాడేరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో అరకులోయ, చింతపల్లి మండలాల్లో పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి శనివారం ఆయన జూమ్‌లో నిర్వహించిన ఇండస్ర్టియల్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు 50 నుంచి 100 ఎకరాలను గుర్తించాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వ్యవసాయానుబంధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో పరిశ్రమల పార్కులు ఏర్పాటు సమగ్రమైన అధ్యయనం చేయాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలన్నారు. అలాగే వ్యవసాయానుబంధ పరిశ్రమలు ఏర్పాటుకు ఐటీడీఏల పరిధిలో వర్క్‌షాపు నిర్వహించాలన్నారు. పాడేరు మండలంలో రెండు ఎకరాల భూమిని గుర్తించాలని సబ్‌ కలెక్టర్‌ శార్యమన్‌ పటేల్‌కు సూచించారు.

పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు

జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పితే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. కాఫీ, ఉద్యానవన, సేంద్రియ వ్యవసాయ పరిశ్రమలు నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలన్నారు. పలు అంశాలపై అధ్యయనం చేసేందుకు చిక్‌మగుళూరు, బెంగళూరు ప్రాంతాల్లో పర్యటించి, పరిశ్రమల పార్కులను సందర్శించాలన్నారు. అలాగే గత సమావేశంలో చర్చించిన అంశాలు, పరిశ్రమలు ఏర్పాటుకు చేపట్టిన భూముల గుర్తింపుపై సమీక్షించారు. ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కాఫీ విభాగం అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ జూమ్‌ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, పాడేరు, రంపచోడవరం సబ్‌ కలెక్టర్లు శౌర్యమన్‌ పటేల్‌, కల్పశ్రీ, జిల్లా పరిశ్రమల అధికారి రవిశంకర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సింహాచలం, జిల్లా ఆగ్రోట్రేడ్‌ మార్కెటింగ్‌ అధికారి పీఆర్‌.రాకేశ్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జీఎస్‌.ప్రసాద్‌, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 01:19 AM