Share News

జిల్లాకు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:08 AM

దేశంలో ఏ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరగని విధంగా రానున్న రోజుల్లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని, గత ఐదేళ్లలో జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు చేసిన అవినీతి, అక్రమాలపై త్వరలోనే విచారణ జరిపించి కేసులు నమోదు చేస్తామని ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు.

జిల్లాకు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయక్‌కుమార్‌, తదితరులు

- నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు

- వైసీపీ నేతల అవినీతిపై త్వరలో విచారణ

- ఎంపీ సీఎం రమేశ్‌

అనకాపల్లి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరగని విధంగా రానున్న రోజుల్లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని, గత ఐదేళ్లలో జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు చేసిన అవినీతి, అక్రమాలపై త్వరలోనే విచారణ జరిపించి కేసులు నమోదు చేస్తామని ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు. అనకాపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల జరిగిన 25 రోజుల బడ్జెట్‌ సమావేశాల్లో మొట్టమొదటిగా అనకాపల్లి పార్లమెంట్‌ గురించి ప్రశ్న అడిగేందుకు లాటరీ పద్ధతిలో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లాలో నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పెందుర్తి, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల పరిధిలో కెమికల్‌ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైందని, త్వరలోనే పెందుర్తి, పాయకరావుపేట, ఎలమంచిలిలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. గతంలో వారి పాలనలో ఎక్కడెక్కడ అవినీతి చేశారో ప్రజలు చూశారని, వాటిపై త్వరలోనే విచారణ జరిపించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. అనకాపల్లి పరిసరాల్లో క్వారీల్లో ఎంపీకి వాటాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు మీడియా సమక్షంలో నిరూపించాలని సవాల్‌ విసిరారు. ఎంపీ పేరుతో ఎవరైనా క్వారీల్లో, ఇతరత్రా తప్పుడు చర్యలకు పాల్పడితే తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించానన్నారు. అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు రానున్న కాలంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, బీజేపీ నాయకులు సురేంద్ర మోహన్‌, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 01:08 AM