అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో?
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:02 PM
మండలంలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

మండలంలో నిలిచిపోయిన సచివాలయ, ఆర్బీకే, వెల్‌నెస్ సెంటర్ల భవన నిర్మాణాలు
గత వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులకు బ్రేక్
ఉద్యోగులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు
చింతపల్లి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం వీటిని ప్రాధాన్యతా భవనాలుగా పేర్కొన్నా నిధులు విడుదల చేయలేదు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. దీంతో ఈ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చింది. మేజర్ పంచాయతీలను రెండు, మూడు గ్రామ సచివాలయాలుగా విభజించింది. ఒక్కొక్క గ్రామ సచివాలయం పరిధిలో 11 మంది ఉద్యోగులను నియమించింది. ఇందులో ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాలను రూపకల్పన చేసింది. గ్రామ సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), వెల్‌నెస్ సెంటర్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)లు ఏర్పాటు చేసింది. వీటికి నూతన భవనాలు మంజూరు చేసి, ప్రాధాన్యతా భవనాలుగా వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ భవనాలు తొమ్మిది నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మండలంలో నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 37 శాతం ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలను పూర్తి చేసింది. 51 భవనాలకు గానూ ఇప్పటికి 19 మాత్రమే పూర్తి చేసింది. 22 గ్రామ సచివాలయాలకు గాను 11, అలాగే 22 రైతు సేవా కేంద్రాలకు ఆరు, ఏడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లకు రెండు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
పెండింగ్ బిల్లుల కోసం నిరీక్షణ
ఈ భవనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఇంకా ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయం భవనం నిర్మాణానికి రూ.43.5 లక్షలు, రైతు సేవా కేంద్రానికి రూ.21.8లక్షలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కి రూ.20.5 లక్షల నిధులను కేటాయించింది. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.10 నుంచి రూ.15 లక్షలు మాత్రమే అందాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా అధికారుల ఒత్తిడి కారణంగా మరో రూ.పది లక్షల సొంత నిధులను కాంట్రాక్టర్లు పెట్టుబడిగా పెట్టారు. ఈ బిల్లులు వైసీపీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులను కాంట్రాక్టర్లు అర్థాంతరంగా నిలిపివేశారు.
నిర్మాణాల నిధులు పెంచితేనే పనులు పూర్తి
ప్రాధాన్యతా భవనాలను పూర్తి చేయాలంటే నిర్మాణాల నిధులు పెంచాలని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం నాటి ధరల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ప్రస్తుతం సిమెంట్, ఐరన్, ఇసుక, కూలీల ధరలు పెరిగిపోవడంతో కూటమి ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తేనే తప్ప పనులు పునఃప్రారంభించలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
అవస్థలు పడుతున్న ఉద్యోగులు
గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను చాలీచాలని ప్రత్యామ్నాయ భవనాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని భవనాలను పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు.