సజావుగా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:13 AM
జిల్లాలో స్థానిక సంస్థ ఉప ఎన్నికలు గురువారం సజావుగా జరిగాయి. జిల్లాలో జి.మాడుగుల ఎంపీపీ, అదే మండలంలోని గెమ్మెలి పంచాయతీ ఉప సర్పంచ్ స్థానాలతో పాటు చింతూరు మండలం కోఆప్షన్ సభ్యుడి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు.

- జి.మాడుగుల ఎంపీపీగా టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు
- చింతూరు కోఆప్షన్ సభ్యుడు, గెమ్మెలి ఉప సర్పంచ్‌గా వైసీపీ మద్దతు దారులు ఎన్నిక
పాడేరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థ ఉప ఎన్నికలు గురువారం సజావుగా జరిగాయి. జిల్లాలో జి.మాడుగుల ఎంపీపీ, అదే మండలంలోని గెమ్మెలి పంచాయతీ ఉప సర్పంచ్ స్థానాలతో పాటు చింతూరు మండలం కోఆప్షన్ సభ్యుడి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు. జి.మాడుగులలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు ఒకరు మృతి చెందగా, మరొకరు సచివాలయ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం 13 ఎంపీటీసీ స్థానాలుండగా, వాటిలో టీడీపీకి 7, వైసీపీకి 6 స్థానాలున్నాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికకు టీడీపీ నుంచి అప్పలరాజు, వైసీపీ నుంచి సత్యనారాయణ పోటీ పడ్డారు. అయితే టీడీపీకి ఉన్న ఆరుగురు సభ్యులు అప్పలరాజుకు మద్దతు తెలపగా, వైసీపీలోని అభ్యర్థి కాకుండా మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఎన్నికకు హాజరుకాలేదు. సత్యనారాయణకు ముగ్గురు మాత్రమే మద్దతు తెలపగా, టీడీపీ అభ్యర్థి అప్పలరాజుకు రెట్టింపుగా సభ్యులు మద్దతు ఉండడంతో ఎంపీపీగా ఆయన ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి విద్యాసాగరరావు నిర్ధారించారు. అలాగే గెమ్మెలి పంచాయతీలో మొత్తం 14 మంది వార్డు సభ్యులుండడంతో ఉప సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. చింతూరు కోఆప్షన్ సభ్యుడిగా ఉన్న అక్బర్ అలీ(వైసీసీ) మృతి చెందడంతో ఆ స్థానానికి గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన మహ్మద్ జిక్రియాను ఎన్నుకున్నారు.
సమష్టి కృషితోనే ఎంపీపీ కైవసం: జీసీసీ చైర్మన్ కిడారి
తెలుగుదేశం పార్టీ నేతల సమష్టి కృషితోనే జి.మాడుగుల ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగామని జీసీసీ చైౖర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. ఎంపీపీగా ఎన్నికైన అప్పలరాజును ఆయన, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్ కేవీ రమేశ్‌నాయుడు, ట్రైకార్ డైరెక్టర్ కె.కృష్ణారావు, మాజీ మంత్రి మణికుమారి, టీడీపీ నేతలు పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణ, బొర్రా విజయరాణి, ఎస్వీవీ రమణమూర్తి, జి.మాడుగుల మండల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.