ఏసీబీ వలలో నక్కపల్లి ఆర్‌ఐ
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:54 AM
వ్యవసాయ పొలంలో బోరు వేయడానికి అనుమతి కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా ఇన్‌చార్జి ఆర్‌ఐ కన్నబాబును శుక్రవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఇందుకు డీఎస్పీ ఎన్.రమ్య మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.

రైతుల నుంచి రూ.12 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
పొలంలో బోరు వేసుకోవడానికి అనుమతి కోసం లంచం డిమాండ్
నక్కపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
వ్యవసాయ పొలంలో బోరు వేయడానికి అనుమతి కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా ఇన్‌చార్జి ఆర్‌ఐ కన్నబాబును శుక్రవారం మధ్యాహ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఇందుకు డీఎస్పీ ఎన్.రమ్య మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.
నక్కపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు తమ వ్యవసాయ పొలంలో బోరు వేయించుకోవడానికి వాల్టా చట్టం కింద అనుమతి కోసం వారం రోజుల కిందట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. దీనిని పరిశీలించిన ఇన్‌చార్జి ఆర్‌ఐ మోటకట్టు కన్నబాబు, ఒక్కో రైతు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.15 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేమని రైతులు చెప్పగా.. వెయ్యి చొప్పున తగ్గించి రూ.12 వేలు ఇస్తేనే అనుమతి పత్రం జారీ చేస్తానని చెప్పాడు. దీంతో రైతులు విశాఖలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు చెప్పిన మేరకు రైతులు శుక్రవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆర్‌ఐ కన్నబాబుకు రూ.12 వేలు ఇచ్చేరు. అప్పటికే సమీపంలో మాటు వేసిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చి కన్నబాబును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కన్నబాబు నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శనివారం విశాఖలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. బాధిత రైతులు తమ పేర్లు బహిర్గతం చేయవద్దని విజ్ఞప్తి చేసినందున వారి వివరాలను వెల్లడించడంలేదని ఆమె తెలిపారు. ఈ దాడుల్లో డీఎస్పీతోపాటు సీఐలు సీహెచ్ లక్ష్మణరావు, పి.శ్రీనివాసరావు, బి.సుప్రియ, వైకే కిశోర్‌బాబు పాల్గొన్నారు.