వైరల్ జ్వరాల విజృంభణ
ABN , Publish Date - Apr 02 , 2025 | 10:58 PM
సబ్ డివిజన్ పరిధిలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల పలు గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి భారీగా పెరిగింది.

ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి
ఎపిడమిక్ సీజన్ ప్రారంభం కావడంతో గిరిజన గ్రామాల్లో వ్యాధులు
క్షేత్ర స్థాయిలో నామమాత్రంగా ప్రత్యేక వైద్య శిబిరాలు
చింతపల్లి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
సబ్ డివిజన్ పరిధిలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల పలు గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి భారీగా పెరిగింది. వారం రోజులుగా ఏరియా ఆస్పత్రికి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వార్డులు కూడా జ్వరబాధితులతో నిండిపోయాయి. పడకలు సరిపడక ఒక మంచంపై ఇద్దరు రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం ఎపిడమిక్(వ్యాధులు) సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో గిరిజన గ్రామాల్లో మలేరియా, వైరల్, టైఫాయిడ్, డెంగ్యూతో పాటు అతిసార వ్యాధులు ప్రబలడం సాధారణం. ప్రస్తుతం వేసవి కాలం కావడం, వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. దీంతో గిరిజన గ్రామాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు అదుపులో ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం కలుషిత నీరు, అపారిశుధ్యం, దోమల వల్ల గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. మార్చి రెండో పక్షం నుంచి 480 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 11 మందికి మలేరియా, 16 మందికి టైఫాయిడ్ నిర్ధారణ అయింది. అయితే వైరల్ జ్వరాలతో సుమారు 1400 మంది చికిత్స పొందారు. ప్రస్తుతం ప్రతి రోజు ఏరియా ఆస్పత్రికి 400 మందికి పైగా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వార్డుల్లో 40- 50మంది జ్వరబాధితులు, గర్భిణులు ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. దీంతో పాటు అతిసార బాధితులు కూడా ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు. తాజాగా గూడెంకొత్తవీధి మండలం పెదపాడు గ్రామంలో మార్చి 24, 25 తేదీల్లో రెండేళ్ల లోపు చిన్నారులు ఇద్దరు జ్వరాలతో బాధపడుతూ మృత్యువాత పడ్డారు. 27వ తేదీన అగ్రహారం గ్రామానికి చెందిన కాకర శివకుమార్ జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. ప్రస్తుతం చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు సరిహద్దు శివారు గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు జ్వరాలతో బాధపడుతున్నారు.
రెండు మండలాలకు పెద్దదిక్కు
చింతపల్లి, జీకేవీధి మండలాలకు స్థానిక ఏరియా ఆస్పత్రి పెద్దదిక్కు. రెండు మండలాల్లో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న రోగులు చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచినప్పటికి తగినన్ని సదుపాయాలు అందుబాటులో లేవు. నూతన భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో సుమారు 20 ఏళ్ల క్రితం ఆస్పత్రి అవసరాల కోసం నిర్మించిన భవనంలోనే సర్దుకుంటూ వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో కేవలం 50 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో రోగుల తాకిడి పెరిగిన సమయంలో ఒకే మంచంపై ఇద్దరిని ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని వార్డులు రోగులతో నిండిపోయాయి.
గ్రామాల్లో కానరాని ప్రత్యేక వైద్య శిబిరాలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఆస్పత్రి ఓపీలోఉంటే, మరో వైద్యాధికారి గ్రామాలను సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేవారు. నెలలో పీహెచ్‌సీ పరిధిలో 15 ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసేవారు. వారపు సంత జరిగే ప్రాంతంలోనూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చి ప్రత్యేక వైద్య శిబిరాలను పక్కన పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా వైద్య,ఆరోగ్యశాఖలో మార్పు రాలేదు. ఇప్పటికీ ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో భాగంగా వారానికి ఒకటి, రెండు రోజులు పీహెచ్‌సీ వైద్యాధికారి ఒకటి, రెండు గ్రామాలను సందర్శించి ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. దీని వల్ల గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలిన వెంటనే చికిత్స అందడం లేదు. గ్రామాల్లో వ్యాధుల పరిస్థితిపై పత్రికల్లో వార్తా కథనాలు వస్తేనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామాల్లో తరచూ ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తే కొంత వరకు ఏరియా ఆస్పత్రిపై రోగుల భారం తగ్గుతుంది. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి గిరిజన గ్రామాల్లో పీహెచ్‌సీ వైద్యులు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.