మేలిరకం అల్లం వంగడాలపై ఫలించిన పరిశోధనలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:15 AM
ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాలకు అనువైన మేలిరకం అల్లం వంగడాలపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో నిర్వహించిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న ఏడు మేలిరకం వంగడాలపై శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు వివిధ దశల్లో అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో జాన్‌జింజర్ రకం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, గిరిజన ప్రాంతానికి అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వంగడం మరో రెండేళ్లలో రైతులకు అందుబాటులోకి రానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

- ఏడు రకాలపై హెచ్‌ఆర్‌యూలో అధ్యయనం
- మూడేళ్ల ప్రయోగాత్మక సాగులో జాన్‌జింజర్ ఎంపిక
- విత్తనాభివృద్ధి ప్రారంభించిన శాస్త్రవేత్తలు
- మూడేళ్లకు రైతులకు అందుబాటులోకి రానున్న నూతన వంగడం
- ఈ ఏడాది నాడియా, సుప్రభ విత్తనాలు పంపిణీ
చింతపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాలకు అనువైన మేలిరకం అల్లం వంగడాలపై స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో నిర్వహించిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న ఏడు మేలిరకం వంగడాలపై శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు వివిధ దశల్లో అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో జాన్‌జింజర్ రకం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, గిరిజన ప్రాంతానికి అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వంగడం మరో రెండేళ్లలో రైతులకు అందుబాటులోకి రానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం(మన్యం), శ్రీకాకుళం గిరిజన మండలాల్లో సుమారు 90 వేల హెక్టారుల్లో అల్లం సాగు జరుగుతున్నది. ఆదివాసీ రైతులు ప్రాంతీయ దేశవాళి రకాలను సాగుచేసుకుంటున్నారు. శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారుల సూచనలు మేరకు 2010 నుంచి గిరిజన రైతులు నాడియా, సుప్రభ రకం అల్లం వంగడాలను సాగుచేస్తున్నారు. నాడియా రకం ఎకరానికి పది టన్నుల సాధారణ దిగుబడి కాగా, రైతులు 8-9 టన్నులు సాధిస్తున్నారు. అయితే మార్కెట్‌లో పీచు తక్కువగా, కొమ్ము పరిమాణం పెద్దదిగా ఉండే అల్లం రకాలకు అధిక డిమాండ్ ఉంది. గిరిజన ప్రాంత రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా చేసుకొని ఈ తరహా మేలిరకం వంగడాలను పరిచయం చేసేందుకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు.
ప్రొ ట్రేల్లో విత్తనం అభివృద్ధి
శాస్త్రవేత్తలు అల్లం నాట్లు వేసేందుకు ప్రొట్రేల్లో విత్తనాన్ని అభివృద్ధి చేశారు. నెల రోజులుగా పరిశోధన స్థానంలో ప్రొట్రేల్లో అభివృద్ధి చేసిన అల్లం మొక్కలను నాట్లు వేసుకున్నారు. సాధారణంగా ఎకరానికి 800 కిలోల అల్లం విత్తనం అవసరం. ప్రొట్రేల ద్వారా మొక్కలను అభివృద్ధి చేయడం వల్ల ఎకరాకి 250- 300 కిలోలు సరిపోతుంది. దుంపకుళ్లు తెగులు ఆశించదు. ఎదిగిన మొక్కలు నాటడం వల్ల మొక్కలన్నీ దిగుబడినిస్తాయి.
ఏడు రకాలపై అధ్యయనం
స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో ఏడు రకాల అల్లం వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. 2022లో స్థానిక శాస్త్రవేత్తలు దేశంలోని పలు రాష్ట్రాల ఉద్యాన పరిశోధన స్థానాల నుంచి మేలిరకం విత్తనాలను దిగుమతి చేసుకున్నారు. జాన్‌జింజర్(కేరళ), గోరుబతాని, బోల్డ్ నాడియా(పశ్చిమబెంగాల్), బైస్(సిక్కిం), గోరుబతాని(పశ్చిమ బెంగాల్), పీజీఎస్-121, పీజీఎస్-95(ఒడిశా) రకాలపై శాస్త్రవేత్తలు పరిశోధన స్థానంలో మూడేళ్లపాటు అధ్యయనం చేశారు.
జాన్‌జింజర్ అనుకూలం
గిరిజన ప్రాంత వాతావరణం, నేలలకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న జాన్‌జింజర్ అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రకాల అల్లం కొమ్ములు పరిమాణంలో పెద్దవిగాను, పీచు తక్కువగా ఉంటుంది. ఎకరానికి 10-11 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ అల్లానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుంది.
విత్తనాభివృద్ధి ప్రారంభం
జాన్‌జింజర్ విత్తనాభివృద్ధిని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఈ ఏడాది ప్రారంభించనున్నారు. రెండేళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన స్థానంలో విత్తనం అభివృద్ధి చేస్తారు. మూడో ఏడాది గిరిజన రైతులకు చిరు సంచుల్లో విత్తనం పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.