పది మంది పోక్సో నిందితులపై రౌడీ షీట్లు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:07 AM
బాలికల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారిపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పోక్సో కేసులు నమోదైన నిందితులపై రౌడీ షీట్లు తెరవాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

- వారి కదలికలపై నిఘా - డీఎస్పీ శ్రీనివాసరావు
నర్సీపట్నం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): బాలికల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారిపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పోక్సో కేసులు నమోదైన నిందితులపై రౌడీ షీట్లు తెరవాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం సబ్ డివిజన్‌లో పది మంది పోక్సో నిందితులపై రౌటీ షీట్లు తెరిచారు. నక్కపల్లిలో ఇద్దరు, గొలుగొండలో ఇద్దరు, నర్సీపట్నం పట్టణ పోలీసు పరిధిలో ఇద్దరు, ఎస్.రాయవరంలో ఇద్దరు, నాతవరం, కోటవురట్లలో ఒక్కొక్కరిపై పోలీసులు రౌడీ షీట్లు తెరిచారు. పదేళ్ల క్రితం నుంచి కేసులు నమోదైన నిందితులు కూడా ఇందులో ఉన్నారు. బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడితే ఉపేక్షించవద్దని జిల్లా ఎస్పీ ఆదేశాలతో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని పోక్సో కేసుల్లో పది మంది నిందితులపై రౌడీ షీట్లు తెరిచినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వీరి కదలికలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.