Share News

పెదపాడులో ఘన స్వాగతం

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:42 AM

జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు ఆదిమ జాతి గిరిజన గ్రామాన్ని సందర్శించగా గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

పెదపాడులో ఘన స్వాగతం
గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్న పవన్‌కల్యాణ్‌

గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

చాపరాయి గెడ్డపై పర్యావరణ హితమైన వంతెన నిర్మిస్తామని హామీ

డుంబ్రిగుడ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు ఆదిమ జాతి గిరిజన గ్రామాన్ని సందర్శించగా గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెదపాడు వాసులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు, తాగునీటి సదుపాయంతో పాటు చాపరాయిగెడ్డపై వంతెన నిర్మించాలని వారు కోరారు. ప్రభుత్వం నుంచి ఈ గ్రామానికి 12 రకాలైన అభివృద్ధి పనులు చేశామని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. పలువురు గర్భిణుల సీమంతాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆశీర్వదించారు. పలువురు వృద్ధ మహిళలతో సంభాషించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. అక్కడ గిరిజనుల మాతృభాషలైన కోందు, కువి భాషల గురించి అడిగి తెలుసుకుని, కువి భాషలోని పదాలను తెలుగులో రాయించుకుని ఆయన వారితో సరదాగా సంభాషించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి, అక్కడ ఏర్పాటు చేసిన విత్తనాల ప్రదర్శనను తిలకించారు. ఒక వృద్ధురాలు అడ్డాకులతో తయారు చేసిన టోపీని పవన్‌కల్యాణ్‌ స్వీకరించి, ధరించారు. చాపరాయి గెడ్డపై వంతెన నిర్మాణానికి కొంత సమయం కావాలని, పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పర్యాటకంగా ప్రయోజనం కలిగేలా వంతెన నిర్మిస్తామని, మరో రెండు నెలల్లో దానిపై స్పష్టత ఇస్తామన్నారు. ఈ సందర్భంగా పెదపాడు గ్రామానికి సంబంధించిన రోడ్డు శంకుస్థాపనలో భాగంగా పవన్‌కల్యాణ్‌ గునపంతో భూమి తవ్వి ప్రారంభోత్సవం చేశారు.

Updated Date - Apr 08 , 2025 | 12:42 AM