Share News

కల్యాణోత్సవానికి వెళ్లి వస్తూ కానరాని లోకాలకు..

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:15 AM

భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించి, వ్యాన్‌లో ఇంటికి తిరిగి వెళుతుండగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామన టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు.

కల్యాణోత్సవానికి వెళ్లి వస్తూ కానరాని లోకాలకు..

  • శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం వెళ్లిన విశాఖ వాసులు

  • స్వామివారి దర్శనం అనంతరం వ్యాన్‌లో తిరుగుముఖం

  • తెల్లవారుజామున పాయకరావుపేట వద్ద టిప్పర్‌ను ఢీకొన్న వాహనం

  • నగరానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి

  • నలుగురికి తీవ్ర గాయాలు

పాయకరావుపేట, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):

భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించి, వ్యాన్‌లో ఇంటికి తిరిగి వెళుతుండగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామన టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖ నగరంలోని వన్‌టౌన్‌ పూర్ణా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు, కుటుంబ సభ్యులు మొత్తం తొమ్మిది మంది శనివారం రాత్రి మ్యాక్సీ క్యాబ్‌లో భద్రాచలం బయలుదేరి వెళ్లారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించి, అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. భోజనాలు చేసిన తరువాత రాత్రి పది గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. వీరి వాహనం సోమవారం తెల్లవారుజామున పాయకరావుపేటలోని ‘వె’ౖ జంక్షన్‌ దాటిన తరువాత ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్‌ చేసింది. ఆ వెంటనే నెమ్మదిగా కదులుతున్న టిప్పర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో వ్యాన్‌ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న గుర్రాల రత్నం (44), ఆమె వెనుక సీట్లో కూర్చున్న జోగా పైడితల్లి (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. క్యాబ్‌ డ్రైవర్‌ చింతకాయల ముత్యాలరావు, మొగవాని కనకమహాలక్ష్మి (పైడితల్లి కుమార్తె), దుంప లిజ, అర్జి ప్రవల్లిక (వీరిద్దరూ తల్లీ కూతుళ్లు) తీవ్రంగా గాయపడ్డారు. వెంకటలక్ష్మి, డి.విజయ, ఐ.వెన్నెల, జె.సాయిదుర్గ, జె.ధనలక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పాయకరావుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో జోగా పైడితల్లిది అల్లిపురం సింహళవీధి. ఈమె జీవీఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసి రిటైర్‌ ఆయ్యారు. మరో మృతురాలు గుర్రాల రత్నం పాత పోస్టాఫీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

Updated Date - Apr 08 , 2025 | 01:15 AM